వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న రఘురామ.. కౌంటరిచ్చిన ప్రభుత్వం

Update: 2021-05-15 09:30 GMT
వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజును నిన్న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారని ఆరోపించారు.

జగన్ బెయిల్ రద్దు చేయమని పిటీషన్ వేసినందుకు పగబట్టి కావాలని అక్రమ అరెస్ట్ చేశారని రఘురామరాజు ఆరోపించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని నిలదీశారు. ఈ అక్రమ అరెస్ట్ లపై ఉన్న దృష్టి కరోనా నియంత్రణపై పెడితే ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అని హితవు పలికారు. తక్షణమే రఘురామకృష్ణంరాజుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా క్షత్రియుల ఆగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గురి అవుతుందని రాఘురామ రాజు హెచ్చరించారు.

ఇక రాఘురామకృష్ణంరాజు అరెస్ట్ పై వస్తున్న విమర్శలకు వైసీపీ సర్కార్ కౌంటర్ ఇచ్చింది. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తాజాగా రఘురామపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 14 నెలలుగా తాను గెలిచిన నియోజకవర్గ ప్రజల కష్టాలను ఎంపీ రఘురామ గాలికి వదిలేశారని విమర్శించారు. రఘురామను ఈ సమయంలో అరెస్ట్ చేయడం సరికాదంటున్న ప్రతిపక్షాలు తీరు సరికాదన్నారు.

ప్రశాంతంగా ఉన్న జిల్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక చెదపురుగులా మారారని మండిపడ్డారు. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తూ తనపై కూడా ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేశారన్నారు. అందుకే నర్సాపురం ఎంపీపై తాను కూడా కేసు పెట్టానని తెలిపారు.ప్రజల మనోభావాలు, ఆచారాలు రఘురామకృష్ణంరాజుకు తెలీదన్నారు. అలాంటి వారికి ఈ అరెస్ట్ ఒక గుణపాఠం కావాలన్నారు.
Tags:    

Similar News