ఆ డాన్ మరీ అంత తెలివితక్కువోడా?

Update: 2015-11-07 08:49 GMT
దేశదేశాల్ని గడగడలాడించి.. గూఢాచార సంస్థలకు ఒక పట్టాన కొరుకుడుపడని అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ఇండోనేషియా పోలీసులకు అలా ఎలా దొరికిపోయాడు? దశాబ్దాల తరబడి వెతికినా కూడా దొరకనోడు అంత సింపుల్ గా ఇండోనేషియా పోలీసుల చేతులకి ఎలా చిక్కాడు? అన్న సందేహం ఇప్పుడు చాలామందిని పట్టి పీడిస్తోంది. దీనికి కొందరు విచిత్రమైన వాదనను వినిపిస్తుంటారు. ఛోటారాజనే తనకు తానుగా పోలీసులకు లొంగిపోయాడని.. ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా అయా దేశాల పోలీసులతో మాట్లాడి అరెస్ట్ అయినట్లుగా చెబుతారు. ఇంతకాలం లేనిది ఇప్పుడే ఎందుకు లొంగిపోయినట్లు? అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం అంత సంతృప్తి కలిగించదు.

ఇంతకీ చోటా ఎలా దొరికిపోయాడన్న మాటకు పోలీసు వర్గాలు చెబుతున్న కథనం ఆసక్తికరంగా మారింది. అంత పెద్ద డాన్ అయిన ఛోటా చేసిన ఒకే ఒక్క చిన్న తప్పు అతన్ని పోలీసులకు పట్టుకునేలా చేసిందని చెబుతున్నారు. ఛోటా రాజన్ గా చిన్న పిల్లాడికి కూడా తెలిసిన ఆయన అసలు పేరు.. రాజేంద్ర సదాశివ నిఖల్జే. అసలు పేరు అదే అయినా ఛోటా రాజన్ గా.. సమయానికి సరిపోయే చాలాపేర్లను వాడేస్తుంటాడు. ఇక.. అక్టోబరు 25న ఇండోనేషియాలో బాలీ ఎయిర్ పోర్ట్ దగ్గర భద్రతాసిబ్బందికి దొరికిపోయే సమయంలో.. ఏం ఆలోచిస్తున్నాడో కానీ.. ఆయన గారి నోటి నుంచి వచ్చిన ఒక్క మాటతో ఛోటా తలరాత మొత్తం మారిపోయింది.

బాలీ నుంచి ఆస్ట్రేలియా వెళ్లేందుకు రెఢీ అయిన ఆయన్ను అక్కడి విమానసిబ్బంది ఛోటాను పేరు అడిగారు. ఏం ఆలోచిస్తున్నాడో కానీ అతని నోటి వెంట తన అసలు పేరు చెప్పేశాడు. అయితే.. అతగాడి పాస్ పోర్ట్ లో మోహన్ కుమార్ అన్న పేరుంది. పాస్ పోర్ట్ లో ఉన్న పేరుకు.. చెప్పిన పేరుకు వ్యత్యాసం తేడాగా ఉండటంతో ఇండోనేషియా అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. అతడ్ని పక్కన పెట్టి.. ఉన్నతాధికారులకు సమాచారం అందించటం.. వారు వచ్చిన ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం.. అతగాడి వేలిముద్రలు సేకరించటంతో అసలు గుట్టు మొత్తం బయటకు వచ్చింది.

దీనికి తోడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక సమాచారం కూడా అతను ఎవరన్న విషయం తెలిసిపోయేలా చేసిందని చెబుతున్నారు. ఇలా.. ఛోటా రాజన్ నోటి నుంచి వచ్చిన ఒకేఒక్క మాట పోలీసులకు చిక్కేలా చేయటమే కాదు.. కనుచూపు దూరంలో బయట పడే అవకాశం లేకుండా చేసిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News