విక్ర‌మ్ గౌడ్ భ‌లే ట్విస్ట్‌ ఇచ్చాడే!

Update: 2017-08-21 08:35 GMT
రెండు వారాల కింద‌ట హైద‌రాబాద్‌ లో కాల్పుల క‌ల‌క‌లం బాధితుడు - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ -  మాజీ మంత్రి కుమారుడు విక్ర‌మ్ గౌడ్ కేసులో తాజాగా వ‌చ్చిన ట్విస్ట్ అదిరిపోయింది! ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో పోలీసులే ట్విస్ట్ ఇచ్చార‌ని అనుకుంటే.. ఇప్పుడు విక్ర‌మ్ ఇచ్చిన ట్విస్ట్ అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు విక్ర‌మ్ గౌడేన‌ని పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో తేల్చి చెప్పేశారు. పొలిటిక‌ల్ సింప‌తీ - అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి త‌గ్గిపోవ‌డం - కుటుంబ ప‌రంగా ఆస్తి లావాదేవీలు కొలిక్కి రావ‌డం వంటి కీల‌క అంశాలే ల‌క్ష్యంగా త‌న‌పై తానే కిరాయి వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హించి విక్ర‌మ్ గౌడ్ కాల్పులు జ‌రిపించుకున్నాడ‌ని పోలీసులు తేల్చేశారు.

అంతేకాదు, ఆయ‌న బుల్లెట్ గాయాల‌తో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అటు నుంచి అటే కోర్టుకు అనంత‌రం జైలుకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌తో హైద‌రాబాద్ స‌హా రెండు తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కి ప‌డ్డాయి. రాజ‌కీయంగా గెలిచేందుకు ఇలా కూడా చేయొచ్చా? అని నేత‌లు సైతం నోరెళ్ల‌బెట్టారు. ఇక‌, పోలీసులైతే.. ఇలాంటి కేసుల‌ను చూడ‌డం త‌మ‌కు ఇదే ఫ‌స్ట్ టైమ్ అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజాగా జైలుకెళ్లిన విక్ర‌మ్ గౌడ్ బెయిల్‌ పై విడుద‌ల‌య్యాడు. అనంత‌రం ఆదివారం ఆయ‌న మీడియా స‌మావేశం పెట్టాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు.

న‌గ‌ర పోలీసులు క‌ట్టుక‌థ‌లు అల్లార‌ని విక్ర‌మ్ గౌడ్ చెప్పారు. అంతేకాదు, ఎవ‌రైనా.. త‌న మీదే కాల్పులు జ‌రిపేందుకు కిరాయి వ్య‌క్తుల‌ను పుర‌మాయించుకుంటారా? అని ఎదురు ప్ర‌శ్నించారు. అసలు త‌న‌పై కిరాయి వ్య‌క్తుల‌ను పెట్టుకుని కాల్పులు జ‌రిపించుకునే కార‌ణం కూడా త‌న‌కు క‌నిపించ‌డం లేద‌ని, పోలీసులు క‌ట్టుక‌థ‌లు అల్లార‌ని విమ‌ర్శించారు.  సింప‌తీతో ఓట్లు సాధించి రాజ‌కీయంగా గెల‌వాల‌ని తాను భావించ‌డం లేద‌న్నారు. ఇక‌, త‌న‌పై వ‌చ్చిన మీడియా క‌థ‌నాల‌ను కూడా విక్ర‌మ్ గౌడ్ త‌ప్పుప‌ట్టారు. `నాకు నేనే కొంద‌రు కిరాయి వ్య‌క్తుల‌ను మాట్లాడుకుని కాల్పులు జ‌రిపించుకున్నాన‌ని అన్నారు. అంతేకాదు, రాజ‌కీయ మైలేజ్ కోసం దీనిని నేను చేసుకున్న‌ట్టు క‌థ‌లు అల్లారు. ఇలాంటి వ్య‌వ‌హారాలు చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదని మీడియాతో అన్నారు.

ఇక‌, పోలీసులు చెబుతున్న నందు అనే వ్య‌క్తి మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడ‌ని - కొన్ని అప్పులు కూడా ఉన్నాయ‌ని, అత‌నికి కొన్ని బెదిరింపులు కూడా వ‌చ్చాయ‌ని, ఈ విష‌యంలో అత‌నే పోలీసుల సాయం కోరాడ‌ని, అయితే వారు ఆ సాయం చేయ‌లేద‌ని విక్ర‌మ్ వివ‌రించాడు. అంతేకానీ, తాను అప్పుల్లో ఉన్నాడంటూ.. పోలీసులు వెల్ల‌డించ‌డాన్ని విక్ర‌మ్ ఖండించాడు. మొత్తం ఈ కేసును పోలీసులు త‌ప్పుదారి ప‌ట్టించార‌ని అన్నాడు. తాను 2024లో మాత్ర‌మే రాజ‌కీయంగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పాడు.  మొత్తానికి విక్ర‌మ్ ఇచ్చిన కౌంట‌ర్ స్టేట్ మెంట్‌ తో పోలీసులు ఇప్పుడు  ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News