ఇండిగోపై ఎయిరిండియా ట్వీట్‌...వైర‌ల్‌!

Update: 2017-11-09 07:47 GMT
అక్టోబ‌రు 15న ఢిల్లీ విమానాశ్ర‌యంలో  రాజీవ్ కటియాల్ అనే వ్య‌క్తిపై ఇండిగో ఎయిర్‌ లైన్స్ సిబ్బంది దాడి చేయ‌డం, ఆ ఘటన వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. ప్ర‌యాణికుడిపై దాడి చేసిన ఉద్యోగిని కాకుండా వీడియో తీసిన ఇండిగో ఉద్యోగిని విధుల్లోనుంచి తొల‌గించిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై స్వతంత్ర నివేదిక సమర్పించాల‌ని  డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఆదేశించారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో....కొంత‌కాలంగా ఇండిగో సిబ్బంది పేరు వార్త‌ల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తోంద‌ని, ఆ సిబ్బంది తీరు స‌రిగా లేద‌ని సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఇండిగోపై ఆ విమ‌ర్శ‌ల‌కు ఊత‌మిస్తూ ఎయిరిండియా ఓ సెటైరిక‌ల్ ట్వీట్ చేసింది.

ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియాలో వాటా కొనేందుకు రెండు నెల‌ల క్రితం ఇండిగో ఆస‌క్తి చూపింది. అయితే, ఆ వ్యవ‌హారం ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. తాజా, దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇండిగోపై ఎయిరిండియా ఓ వ్యంగ్యాత్మ‌క ట్వీట్ చేసింది. ఆ ఘ‌ట‌న‌లో ఇండిగో వైఖ‌రిని త‌ప్పుబ‌డుతూ రెండు కొత్త ప్ర‌క‌ట‌న‌లను త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. `` మేము న‌మ‌స్కారం పెట్ట‌డానికి మాత్ర‌మే చేతులు ఎత్తుతాం`` అంటూ ట్వీట్ చేసింది. ప్ర‌యాణికుడిపై చెయ్యెత్తిన ఇండిగో సిబ్బందిని వ్యంగ్యంగా విమ‌ర్శించింది. `` మా స‌ర్వీస్ ను ఎవ‌రూ `బీట్` చేయ‌లేరు`` అంటూ `బీట్` అక్ష‌రాల రంగును నీలి రంగులో హైలైట్ చేస్తూ ట్వీట్ చేసింది.  ప్ర‌యాణికుడిని `బీట్` (కొట్టిన‌) చేసిన ఇండిగో `బ్లూ` సిబ్బంది వ్య‌వ‌హార శైలిని వెక్కిరిస్తూ ఈ ట్వీట్ చేసింది. అయితే, ఆ న‌మ‌స్కారానికి సంబంధించిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఎయిరిండియా వెంట‌నే దానిని డిలీట్ చేసింది.

గ‌తంలో హెచ్ టీసీ - సామ్ సంగ్‌ - ఎల్ జీ వంటి మొబైల్ కంపెనీలు యాపిల్ ఫోన్ల‌పై ఒ సెటైరిక‌ల్ పోస్ట్ చేశాయి. షోరూమ్ లో కొన్న రోజే యాపిల్ ఫోన్ బెండ్ అవ్వ‌డంతో హ్యాష్ ట్యాగ్ బెండ్ గేట్ అనే పేరుతో యాపిల్ ను ట్రోల్ చేశాయి. ఆ సంస్థ‌లను స్ఫూర్తిగా తీసుకొని ఎయిరిండియా ....ఇండిగోపై విమ‌ర్శ‌లు గుప్పించింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, గ‌తంలో అనేక సంద‌ర్భాల‌లో ఎయిరిండియా సిబ్బంది సేవ‌ల‌పై చాలామంది సెల‌బ్రిటీలు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యాన్ని ఆ సంస్థ మ‌రిచిపోయిందంటూ విమ‌ర్శిస్తున్నారు. ఎయిరిండియా విమాన సిబ్బంది - గ్రౌండ్ స్టాఫ్ ల ప్ర‌వ‌ర్త‌నను గుర్తు చేస్తున్నారు.
Tags:    

Similar News