నెల్లూరు లెక్క ఎలా త‌ప్పింద‌బ్బా..?

Update: 2021-11-18 05:04 GMT
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి పెద్ద ఎఫెక్టే ప‌డింది. అంది వ‌చ్చిన చ‌క్క‌ని అవ‌కాశాన్ని కూడా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మంది ఉంది. మార్బ‌లం ఉంది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పుష్క‌లంగా ఉంది. అధికార పార్టీలో అస‌మ్మ‌తి నేత‌ల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆయా అవ‌కాశాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం.. టీడీపీ చేయ‌లేదు. ఫ‌లితంగా క‌నీసం ఒక్క‌టంటే.. ఒక్క‌వార్డులోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. ఇది భారీ ఎఫెక్ట్‌గా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అదే నెల్లూరు జిల్లా కీల‌క‌మైన నెల్లూరు కార్పొరేష‌న్‌. ఇక్క‌డ పాగా వేయ‌డం.. టీడీపీకి నిజంగానే క‌లిసి వ‌చ్చే ప‌రిణామాలతో పోల్చుకుంటే.. చాలా తేలిక‌.

నెల్లూరు వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య విబేదాలు ఉన్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేదు. ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. చాలా మంది తీవ్ర అస‌మ్మ‌తితో ర‌గిలిపోతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గంలోనే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఉన్నాయి. అయితే.. వీటిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే విష‌యంలో టీడీపీ విఫ‌ల‌మైంది. నిజానికి ఆది నుంచి కూడా నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ప‌ట్టు బిగించేందుకు టీడీపీ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా క‌నిపించ‌లేదు.

జిల్లా నాయ‌కుడు బీద ర‌విచంద్ర యాద‌వ్‌కు బాధ్య‌త‌లు ఇచ్చిన‌ట్టే ఇచ్చి.. తెర‌వెనుక‌.. మ‌రికొంద‌రిని రంగంలోకి దించారు. ఈ ప‌రిస్థితి ర‌విచంద్ర‌కు ఇబ్బందిగా మారింది. ఇక‌, ఓట‌మి వీరుడుగా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిపైనే చంద్ర‌బాబు ఆధార‌ప‌డ్డార‌నే వాద‌న కూడా ఉంది. ఇక మంత్రి నారాయ‌ణ ఈ ఎన్నిక‌లు ముందు నుంచే ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు.. ఆది నుంచే వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. త‌మ‌ను అడ్డుకుంటున్నార‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం.. నామినేష‌న్ల ప‌ర్వంలోనూ.. కొంద‌రు వైసీపీ నేత‌ల ప్ర‌లోభాల‌కు లొంగిపోయినా.. టీడీపీ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి ఆ పార్టీకి అశ‌నిపాతంగా మారాయి.

ఇక‌, జిల్లాకు సంబంధించిన నేత‌ల‌కు బాధ్య‌త‌లు త‌క్కువ‌గా అప్ప‌గించి.. ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చిన వారికి ఎక్కువగా బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే కామెంట్లు కూడా ఎన్నిక‌ల ప్రారంభంలోనే వినిపించాయి. నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప వంటివారు.. జిల్లాలో ఎందుకు తిష్ట‌వేశారో.. ఆయ‌న‌కే తెలియాలి. లేదా.. ఆయ‌న‌ను ఎందుకు పంపించారో.. చంద్ర‌బాబుకు తెలియాల‌నే కామెంట్లు వినిపించాయి.

నిజానికి ఒక వ్యూహం ప్ర‌కారం.. ఇక్క‌డ ప‌నిచేసి ఉంటే.. ఖ‌చ్చితంగా మ‌రిన్ని మెరుగైన సీట్లు సాధించి ఉండేది. చేజేతులా ఇక్క‌డ అన్ని అవ‌కాశాల‌ను కోల్పోయిన ప‌రిస్థితి పార్టీని దారుణ ప‌రిస్థితి తీసుకువ‌చ్చింది. మ‌రి దీనికి ఎవ‌రు బాధ్యులు..?  ఏం చేస్తారు? అనేది.. టీడీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది.
Tags:    

Similar News