మాస్కులు ధరిస్తే బ్యూటీపార్లర్లు ఎలా నడుస్తాయి.. అసోం ఆరోగ్య మంత్రి సంచలన వ్యాఖ్య

Update: 2021-04-05 23:30 GMT
తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని నేతల పేర్లలో ఒకటి.. హేమంత బిశ్వా శర్మ. అసోంలో బలమైన బీజేపీనేత. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అసోం రాష్ట్ర బీజేపీకి ముఖం లాంటి ఈ నేత తీరు రోటీన్ కు భిన్నం. తనకు తెలిసినంతగా మరెవరికీ తెలీదన్నట్లుగా కోవిడ్ గురించి చెప్పే మాటలు షాకింగ్ గా ఉంటాయి. ఓపక్క దేశంలో కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ.. రానున్న కొద్ది రోజుల్లోనే రోజుకు లక్ష కేసుల్ని టచ్ చేసినా ఆశ్చర్యపోలేని పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది.

ఇలాంటివేళ.. ప్రతి ఒక్కరు మరింత అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ నిబంధనల్ని అమలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో మాస్కుల్ని ధరించటం తప్పనిసరి చేశారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయన్న దానికి నిదర్శనంగా పలు రాష్ట్రాల్లోని పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం అసోం అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన..ముఖానికి మాస్కు పెట్టుకోరు. ఆయన అనుచరులు సైతం ముఖానికి మాస్కు పెట్టటానికి ఇష్టపడరు.

ఎందుకిలా అంటే.. అసోంలో కోవిడ్ లేదని తేల్చేశారు. మరి.. కేంద్రం కోవిడ్ విషయంలో జారీ చేస్తున్న మార్గదర్శకాల సంగతి ఏమిటంటే.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అసోంలో కోవిడ్ లేదని నేను చెబుతున్నాను కదా? అని అడ్డదిడ్డంగా మాట్లాడే ఆయన మాటలు షాకింగ్ గా ఉంటాయి. అసోంలో.. ఏ నియోజకవర్గంలో నిలబడినా గెలిచే సత్తా ఉన్న ఈ నేతకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ.

కోవిడ్ మళ్లీ వస్తే.. తానుప్రజలకు చెబుతానని.. అప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. కోవిడ్ గురించి ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మాస్కు పెట్టుకుంటే బ్యూటీపార్లర్లు ఎలా నడుస్తాయి? అంటూ వేసిన ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక పక్క కోవిడ్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతుంటే.. ముందు ప్రాణాలు నిలవటానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాల్సింది పోయి.. ముఖానికి మాస్కు పెట్టుకుంటే బ్యూటీ పార్లర్లు  ఎలా నడుస్తాయన్న ఆయన ప్రశ్న షాకింగ్ గా మారింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Tags:    

Similar News