రాజీవ్ తో మొద‌లెడితే మోడీతో ముగిసింది

Update: 2017-07-01 07:14 GMT
రాజ‌కీయ విభేదాలు మామూలే. కానీ.. కొన్ని కీల‌క అంశాల విష‌యంలో రాజ‌కీయాల్ని వ‌దిలేయాల్సి ఉంటుంది. ఈ విష‌యాలు రాజ‌కీయ పార్టీల‌కు.. నేత‌ల‌కు బాగా తెలుసు. ఈ కార‌ణంతోనే మిగిలిన వేళ‌ల్లో ఎలా ఉన్నా.. కొన్ని విష‌యాల‌కు వ‌చ్చేస‌రికి మాత్రం చేయాల్సింది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకే దేశం.. ఒకే ప‌న్ను అంటూ జై గంట కొట్టి మ‌రీ దేశ ప్ర‌జ‌ల మీద స‌రికొత్త ప‌న్నుల విధానాన్నితీసుకొచ్చిన ప్ర‌ధాని మోడీ.. జీఎస్టీ అంతా త‌మ ఘ‌న‌తే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది. అయితే.. ఇదే మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఉన్న వేళ‌లో జీఎస్టీని అమితంగా వ్య‌తిరేకించారు. జీఎస్టీని కానీ అమ‌లు చేస్తే దేశం ఎంత ఇబ్బంది ప‌డుతుందో తెలుసా? అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

కాల‌క్ర‌మంలో గుజ‌రాత్ సీఎంగా ఉన్న మోడీ.. ప్ర‌ధాని కావ‌ట‌మే ఆయ‌నే జీఎస్టీని పూర్తి చేయ‌టం క‌నిపిస్తుంది. ఈ రోజున క‌మ‌ల‌నాథులు ప‌లువురు జీఎస్టీ అంతా త‌మ క్రెడిట్ అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ.. ఈ క‌ల ఇప్ప‌టిది కాదు. రాజీవ్ హ‌యాం నుంచి ఉన్న‌ది. దివంగ‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 1986-87లోనే జీఎస్టీ మీద ఆలోచ‌న‌లు చేశారు.  రాజీవ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న క్యాబినెట్ లో ఆర్థిక‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వీపీ సింగ్.. దేశం మొత్తానికి ఒకే ప‌న్ను ఉండాల‌న్న ఆలోచ‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.  అందులో భాగంగా మోడ్ వ్యాట్‌కు శ్రీ‌కారం చుట్టారు.

దేశం మొత్తానికి ఒకే ప‌న్ను విధానం ఉండాల‌న్న ఆలోచ‌న‌కు దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ఆర్థిక‌వేత్త అసిమ్ దాస్ గుప్తా మొద‌లు.. కేఎం మ‌ణి.. అమిత్ మిత్రాల చేతిలో జీఎస్టీ ప‌దును తేలిందని చెప్పాలి. ఆర్థిక‌వేత్త‌.. మేధావి అయిన పీవీ న‌ర‌సింహ‌రావు ప్ర‌ధానిగా ఉన్న వేళ స‌ర‌ళీకృతి ఆర్థిక విధానాల‌కు శ్రీ‌కారం చుట్టారు. వాణిజ్యంతో పాటు సేవ‌ల రంగం కూడా వేగంగా విస్త‌రించ‌టాన్ని గుర్తించిన నాటి ఆర్థిక‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ 1994-95లో సేవా ప‌న్నును తెర మీద‌కు తీసుకొచ్చారు.

అలా కాంగ్రెస్ హ‌యాంలో మొద‌లైన మోడ్ వ్యాట్‌.. స‌ర్వీస్ టాక్స్ లు కాల‌క్ర‌మంలో 1999లో వాజ్ పేయ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు నేటి జీఎస్టీ పురుడు పోసుకుంది. త‌న స‌ల‌హాదారులైన ఐజి ప‌టేల్‌.. బిమ‌ల్ జ‌లాన్‌.. రంగ‌రాజ‌న్ తో స‌మావేశ‌మై చ‌ర్చించిన వాజ్ పేయ్ జీఎస్టీని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత ఏడాదే ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త.. క‌మ్యూనిస్ట్ భావ‌జాలం ఉన్న అసిమ్ దాస్ గుప్తా (సీపీఎం) సార‌థ్యంలో జీఎస్టీ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఇక్క‌డ ఇంకో విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించాలి. అసిమ్ దాస్ గుప్తా బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వ్య‌వ‌హ‌రించేవారు. దీంతో ప్ర‌ధాని వాజ‌య్ పేయి.. బెంగాల్ ముఖ్య‌మంత్రి జ్యోతిబ‌సుకు స్వ‌యంగా ఫోన్ చేసి జీఎస్టీ క‌మిటీకి అసిమ్ దాస్ గుప్తా సేవ‌లు వినియోగించుకోవ‌టానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోరారు. ఇలా మొద‌లైన జీఎస్టీ త‌ర్వాతి ద‌శకు వెళ్ల‌టానికి మ‌రో మూడేళ్ల‌కు పైనే ప‌ట్టింది.

2006-07 బ‌డ్జెట్ స‌మ‌యంలో అప్ప‌టి ఆర్థిక‌మంత్రి చిదంబ‌రం జీఎస్టీపై తొలి ప్ర‌క‌ట‌న చేశారు. 2010 ఏప్రిల్ నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించినా అది సాధ్యం కాలేదు.  2011లో జీఎస్టీ అమ‌లుకు వీలుగా 115వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అప్ప‌ట్లో బీజేపీ దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది. పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం 2013లో బిల్లుపై స‌మ‌గ్ర నివేదిక‌ను స‌మ‌ర్పించింది. 2014లో లోక్ స‌భ ర‌ద్దు కావ‌టంతో జీఎస్టీ బిల్లు చ‌ట్టంగా మారేందుకు మ‌రింత ఆల‌స్య‌మైంది. మోడీ నేతృత్వంలో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం.. కుదురుకొని జీఎస్టీ మీద దృష్టి పెట్ట‌టానికి కాస్త టైం ప‌ట్టింది. 2015లో జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ పెట్టారు అరుణ్ జైట్లీ. వాద ప్ర‌తివాదాల అనంర‌తం బిల్లు పాస్ అయ్యింది. విపక్షాలు రెండు స‌వ‌ర‌ణ‌ల కోసం ప‌ట్టుప‌ట్టాయి. దీంతో 2016 ఆగ‌స్టులో జీఎస్టీ బిల్లుకు ఆమోదం ల‌భించింది. అనంత‌రం జీఎస్టీ క‌మిటీ ఏర్పాటైంది. రాష్ట్రాల ఆమోదం పొందిన త‌ర్వాత కూడా పెద్ద త‌తంగ‌మే న‌డిచింది. మార్చిలో జీఎస్టీ కార‌ణంగా రాష్ట్రాలకు వ‌చ్చే ఆదాయం త‌గ్గితే దాన్ని భ‌ర్తీ చేసేందుకు వీలుగా ప‌రిహారం చెల్లించే అంశాల‌పై నాలుగు బిల్లుల్ని లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. వాటికి లోక్ స‌భ ఆమోదం ల‌భించిన త‌ర్వాత రాజ్య‌స‌భ ఆమోదం ల‌భించింది. ఆ త‌ర్వాత జీఎస్టీ అమ‌లు విధానం వేగం పుంజుకుంది. చివ‌ర‌కు మేలో కేంద్రం నాలుగు అంచెల జీఎస్టీ ప‌న్నుల విధానాన్ని కేంద్రం ప్ర‌క‌టించింది. నిన్న అర్థ‌రాత్రి త‌ర్వాత నుంచి జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. అలా.. రాజీవ్ క‌ల‌ను మోడీ నెర‌వేర్చార‌ని చెప్పాలి. విచిత్రం ఏమిటంటే.. రాజీవ్ క‌న్న క‌ల సాకారం అయ్యే వేళ జీఎస్టీని కాంగ్రెస్ వ్య‌తిరేకిస్తే.. జీఎస్టీని మొద‌ట్నించి వ్య‌తిరేకించిన మోడీ ప్ర‌ధాని హోదాలో తానే అమ‌లుకు కార‌ణం కావ‌టం చూసిన‌ప్పుడు కాలమ‌హిమ అంటే ఇదేనేమో అనిపించ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News