బద్వేలులో బీజేపీకి ఎంత కష్టమొచ్చింది ?

Update: 2021-10-22 11:30 GMT
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీచేస్తున్న కమలంపార్టీ విచిత్రమైన పరిస్ధితులు ఎదుర్కొంటోంది. పోలింగ్ లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది ఇక్కడ పెద్ద విషయంకాదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లొచ్చాయనే విషయాన్ని గమనిస్తే జరగబోయే ఉపఎన్నికలో ఎన్ని ఓట్లొస్తాయనే విషయాన్ని అంచనావేయొచ్చు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు 735 మాత్రమే. ఈ ఓట్లను బట్టిచూస్తే జరగబోయే పోలింగ్ లో మహా అయితే ఓ వంద ఓట్లు అటో ఇటో అని అంచనా వేసుకోవచ్చు.

అయితే బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం తాము బ్రహ్మాండాన్ని బద్దలు కొడతామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ నేతల్లో ఎవరేమి చెప్పినా, చెబుతున్నా అసలు విషయం ఏమిటనేది అందరికీ తెలిసిందే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇపుడు బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకటంలేదట. నియోజకవర్గంలో సుమారు 200 పోలింగ్ కేంద్రాలున్నాయని అనుకుంటే 200 మంది పోలింగ్ ఏజెంట్లు ఉండాల్సిందే కదా.

కానీ కమలం పార్టీకి మాత్రం పట్టుమని 50 మంది కూడా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి ముందుకు రావటంలేదట. పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి ఎందుకు ముందుకు రావటంలేదంటే అంతమంది నేతలు లేరుకాబట్టే. పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకోవటంలో రాష్ట్రపార్టీ నూరుశాతం ఫెయిలైంది. దీనికి అదనంగా జాతీయపార్టీ కూడా యధాశక్తి పార్టీ ఎదుగుదలను వీలైనంతగా అడ్డుకుంటోంది. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కటం ద్వారా రాష్ట్రాన్ని కేంద్రం దెబ్బకొడుతుంటే ఇక పార్టీ ఏ విధంగా బలపడుతుంది.

ఉపఎన్నికలో పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేకపోతే ఎంత అవమానం. అందుకనే ఏదోరకంగా ఏజెంట్లను పెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ కార్యకర్తలను ఏజెంట్లుగా కూర్చోమని అడుగుతున్నారట. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి బుధవారం అట్లూరు మండలంలోని గోపీనాధపురంలో కొందరు టీడీపీ నేతలను కలిశారట. బీజేపీ తరపున పోలింగ్ రోజున ఏజెంట్లుగా కూర్చోమని రిక్వెస్టు చేశారట. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ సమక్షంలోనే టీడీపీ నేతలను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోమని ఆదినారాయణరెడ్డి బతిమాడుకోవటం విచిత్రంగా ఉంది.


Tags:    

Similar News