త‌గ్గ‌ని మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌.. లాక్‌ డౌన్‌ తో సాధించిందేంటి..?

Update: 2020-05-19 09:10 GMT
చైనా నుంచి మాయ‌దారి వైర‌స్ భార‌త‌దేశంలోకి ప్ర‌వేశించి విజృంభిస్తోంది. ఒక్క మూడు నెల‌ల్లోనే ల‌క్ష‌కు పైగా ప్ర‌జ‌ల‌కు వ్యాపించి బీభ‌త్సం సృష్టించింది. ప్ర‌పంచ‌ దేశాల్లో విస్త‌రిస్తున్న స‌మ‌యంలోనే భార‌త్ ఓ క‌న్నేసి ఉంచింది. అక‌స్మాత్తుగా దేశంలోకి ప్ర‌వేశించ‌డం తో వెంట‌నే అప్ర‌మ‌త్తమైంది. త‌ద‌నుగుణంగా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంది. మ‌రికొన్ని రోజుల‌కు వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో వెంట‌నే భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. ఆ మ‌హ‌మ్మారిని పార‌దోలేందుకు దేశాన్ని పూర్తిగా స్తంభించ‌డ‌మే మార్గ‌మ‌ని గుర్తించి లాక్‌డౌన్ విధించింది. మొద‌టి పాజిటివ్ కేసు కేర‌ళ‌లో జ‌న‌వ‌రి 30వ తేదీన ప్ర‌వేశించింది. ఆ రాష్ట్రంలో మ‌రో రెండు కేసులు కూడా న‌మోదు కాగా వెంట‌నే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్యలు తీసుకుంది. వారిని పూర్తిగా కోలుకునేలా చేసింది. అనంత‌రం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ఢిల్లీల్లో న‌మోదైన కేసుల‌తో దేశంలో ఆ వైర‌స్ విజృంభ‌ణ మొద‌లైంది.

అప్ప‌టి నుంచి ఇప్పుడు మే 19వ తేదీ వ‌ర‌కు ఆ వైర‌స్ దాడి కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 101,139మందికి పాజిటివ్ సోక‌గా, 39,174 మంది కోలుకున్నారు. 3,163 మంది ఆ వైర‌స్ బారిన ప‌డి మృతి చెందుతున్నారు. ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే వైర‌స్ విజృంభ‌ణ ప్రారంభ‌మైన స‌మ‌యంలోనే భార‌త ప్ర‌భుత్వం స్పందించి ముందుగా మార్చి 22వ తేదీన జ‌న‌తా క‌ర్ఫ్యూ పేరిట దేశ‌మంతా ఒక‌రోజు స్వీయ నిర్బంధం విధించారు. ఆ కార్య‌క్ర‌మం అత్య‌ద్భుతంగా సాగింది. అయితే కేసులు పెరుగుతుండ‌డం తో మార్చి 24వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

మొద‌టి ద‌శ లాక్‌డౌన్: మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 దాక (21 రోజులు)
రెండో ద‌శ లాక్‌డౌన్ : ఏప్రిల్ 14 నుంచి మే 3 వ‌ర‌కు
మూడో ద‌శ లాక్‌డౌన్ : మే 3 నుంచి మే 17 వ‌ర‌కు
నాలుగో ద‌శ లాక్‌డౌన్ : మే 17 నుంచి 31వ తేదీ వ‌ర‌కు (ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది)

లాక్‌డౌన్ అనేది ఆ వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు విధించారు. అయితే విధించిన లాక్‌డౌన్ విజ‌య‌వంతంగా కొన‌సాగింది. భార‌త ప్ర‌భుత్వం విధించిన మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ‌మొద‌టి ద‌శ లాక్‌డౌన్‌లోనే వైర‌స్ అదుపులోకి వ‌చ్చింది. ఆ మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ప‌రిణామాలు క‌నిపిస్తున్న స‌మ‌యంలోనే దేశంలో ఒక్క‌సారిగా ఓ పెద్ద కుదుపు ప‌డింది. అదే మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లు. వాటి ద్వారా కేసులు విప‌రీతంగా పెరిగాయి. దీంతో రెండో ద‌శ లాక్‌డౌన్ విధించారు. ఆ త‌ర్వాత ఆ వైర‌స్ వ్యాప్తి ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు.. స‌రికదా ఆ కేసుల సంఖ్య భారీగా న‌మోద‌వ‌డం మొద‌లైంది. వెయ్యి నుంచి మొద‌లైన కేసులు క్ర‌మేణా పెరుగుతూ ఇప్పుడు ల‌క్షకు పైగా చేరాయి. మూడు ద‌శ‌లు పూర్త‌యి నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా వైర‌స్‌ను అదుపులోకి తీసుకురాక‌పోవ‌డం చూస్తుంటే లాక్‌డౌన్ విఫ‌లమైంద‌ని ప్ర‌జ‌ల్లో అభిప్రాయం ఏర్ప‌డుతోంది. ప్ర‌జ‌లు పాటించిన శ్ర‌ద్ధ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ వైర‌స్ విజృంభించింది. తీరా ఇప్పుడు ఆ వైర‌స్‌ ను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతే దానితో స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని పేర్కొన‌డం వారి వైఫ‌ల్యానికి ప్ర‌తిఫ‌లంగా చెప్ప‌వ‌చ్చు.

ఇన్నాళ్లు లాక్‌డౌన్ విధించి సాధించిన‌ది ఏమంటే పేద‌ల‌ను, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను క‌ష్టాలు, న‌ష్టాల బారిన ప‌డేయ‌డ‌మే. ముఖ్యంగా వ‌ల‌స కార్మికుల‌ను రోడ్డు పాలు చేయ‌డ‌మే. విద్యార్థుల చ‌దువుల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే.. చిరు వ్యాపారులు, చిరుద్యోగుల‌ను క‌ష్టాలు సుడి గుండంలో ప‌డేయ‌డ‌మే చేశారు. ఈ లాక్‌డౌన్‌ తో క‌ష్టాలు ప‌డుతున్న పేద‌ల కోసం కేంద్రం ప్ర‌క‌టించిన రెండు ప్యాకేజీలు ఏమ‌య్యాయో తెలియ‌దు. ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం అండ‌గా నిల‌వ‌ని ప‌రిస్థితి మ‌నం చూస్తున్నాం. ప్ర‌జ‌ల‌కు అంకెలు త‌ప్ప వారి చేతికి రూపాయి రాలేద‌నేది వాస్త‌వం.

వైర‌స్ నివార‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌క్ర‌మంగా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. ఎందుకంటే భారీ స్థాయిలో ప‌రీక్ష‌లు చేసి బాధితుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని ఉంటే ఆ మ‌హ‌మ్మారి తోక ముడుచుకుని వెళ్లిపోయేద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌గా కేర‌ళ రాష్ట్రాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వైర‌స్‌ ను నియంత్రించ‌లేక చేతులెత్తేసి పేరుకు లాక్‌డౌన్ విధించి భారీగా స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో లాక్‌డౌన్ ఉన్నా నిష్ప్ర‌యోజ‌న‌మే. చివ‌రి మాట‌గా వైర‌స్‌ తో స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా మించిన‌ది ఏది లేదు. ఒక్క వారం రోజులు దేశంలోని ప్ర‌తి ఇంటిలో ప‌రీక్ష‌లు చేసి అనారోగ్యంతో ఉన్న‌వారందిరినీ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తే దెబ్బ‌కు వైర‌స్ ఎక్క‌డా ఉన్నా అదుపులోకి వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు సూచిస్తున్నారు. ఇన్ని లాక్‌డౌన్‌లు విధించి ప్ర‌జ‌లను క‌ష్టాలు పెట్ట‌డం త‌ప్ప ప్ర‌భుత్వాలు సాధించిన‌ది ఏదీ లేదని అంద‌రికీ అర్థ‌మ‌వుతూనే ఉంది.
Tags:    

Similar News