2021 మార్చి జీఎస్‌టీ వసూళ్లు ఎన్ని లక్షలకోట్లంటే

Update: 2021-04-01 16:30 GMT
జీఎస్ ‌టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. 2021 మార్చిలో రూ.1.23 లక్షల కోట్లు వసూలు అయింది. ఇది గత  ఏడాది ఇదే సమయంలో వసూలైనదాని కన్నా 27 శాతం ఎక్కువ అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గడచిన ఐదు నెలల నుంచి జీఎస్‌ టీ వసూళ్ళు  మళ్లీ పెరుగుతున్నాయి. మార్చి నెల  జీఎస్‌టీ వసూళ్ల  వివరాలను  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.  ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, వస్తువుల దిగుమతులపై ఆదాయం 2020 మార్చిలో కన్నా 70 శాతం అధికంగా 2021 మార్చిలో వచ్చింది. సేవల దిగుమతి సహా దేశీయ లావాదేవీల నుంచి ఆదాయం 2020 మార్చిలో కన్నా 17 శాతం ఎక్కువగా ఈ ఏడాది మార్చిలో వచ్చింది.

2021 మార్చిలో వసూలైన గ్రాస్ జీఎస్ ‌టీ రెవిన్యూ రూ.1,23,902 కోట్లు అని ఈ ప్రకటన లో వెల్లడించింది. దీనిలో సీజీఎస్ ‌టీ రూ.22,973 కోట్లు, ఎస్‌ జీఎస్ ‌టీ రూ.29,329 కోట్లు, ఐజీ ఎస్ ‌టీ (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.31,097 కోట్లు సహా) మొత్తం  రూ.62,842 కోట్లు, సుంకాలు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.935 కోట్లు సహా) రూ.8,757 కోట్లు అని ప్రకటించింది.  2019-20 ఆర్థిక సంవత్సరంలో 12 నెలలకు తొమ్మిది నెలల్లో జీఎస్ ‌టీ ఆదాయం రూ.1 లక్ష కోట్ల మార్క్‌ ను తాకింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి  వల్ల ఆదాయానికి గండి పడింది. ఆరు నెలల నుంచి జీఎస్ ‌టీ వసూళ్ళు ప్రతి నెలా రూ.1 లక్ష కోట్ల మార్కును తాకుతోందని, కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నదనడానికి ఇదే నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చక్కని వృద్ధి పథంలో కొనసాగాయి. వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.1.05 లక్షల కోట్లతో పోల్చి చూస్తే.. 7 శాతం వృద్ధితో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,19,875 కోట్లుగా ఉండగా, 2020 డిసెంబర్‌లో రూ.1.15లక్షల కోట్ల మేర వసూలైంది. 
Tags:    

Similar News