హైద‌రాబాద్ నుంచి సొంతూరు వెళ్లింది ఎంత‌మంది?

Update: 2018-01-14 06:22 GMT
కిక్కిరిసిన రోడ్లు.. కొద్ది దూరానికే గంట‌ల పట్టే ట్రాఫిక్ జాంలు. పండ‌గ‌లు.. ప‌ర్వ‌దినాలు వ‌చ్చాయంటే వీధుల్లో జ‌న సందోహం.. ఇలాంటివి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌లో రెగ్యుల‌ర్ గా క‌నిపిస్తుంటాయి. కానీ.. ఇప్పుడు  అలాంటివేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి. తెలుగువారికి పెద్ద పండుగైన సంక్రాంతి సంద‌ర్భంగా సీన్ మొత్తం మారిపోయింది.

మూడు రోజుల పండ‌గ‌తో పాటు.. పిల్ల‌ల‌కు స్కూల్ సెల‌వులు ఉన్న నేప‌థ్యంలో ఏడాదికి ఒక‌సారి అంద‌రిని క‌లుసుకోవ‌టానికి వీలుగా త‌ప్ప‌నిస‌రిగా సొంతూరుకు వెళ్లే అల‌వాటు ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్పుడు అది మ‌రింత ఎక్కువైంది. ఈ ఏడాది సంక్రాంతి స్పెష‌ల్ ఏమిటంటే.. వారంతంలో ప్రారంభ‌మ‌య్యే పండుగ‌.. త‌ర్వాత వారం లోకి కొన‌సాగ‌టం. దీంతో..  రెగ్యుల‌ర్ కంటే ఎక్కువ మంది ఊళ్ల‌కు వెళ్లిన వైనం క‌నిపిస్తుంది.

ఒక అంచ‌నా ప్ర‌కారం దాదాపు 20 ల‌క్ష‌ల‌కు పైనే హైద‌రాబాదీలు సొంతూళ్ల‌కు ప‌య‌న‌మై ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ లెక్క కేవ‌లం రైళ్లు.. బ‌స్సులు మాత్ర‌మే. ఇక‌.. సొంత వాహ‌నాల్ని క‌లుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 30 ల‌క్ష‌ల మేర ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ అంకెల‌న్నీ శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మాత్ర‌మే. శ‌నివారం రాత్రి.. ఆదివారం క‌లుపుకంటే త‌క్కువ‌లో త‌క్కువ 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చు.

ఇంత భారీగా న‌గ‌ర‌జీవులు సొంతూళ్ల‌కు ప‌య‌నం కావ‌టంతో హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్లు బోసీ పోయాయి. వీధుల్లో జ‌న సంచారం పలుచ‌గా ఉంటోంది. వ‌రుస సెల‌వు రోజుల్లో సాధార‌ణంగా కిక్కిరిసిపోయిన‌ట్లు ఉండే షాపింగ్ మాల్స్‌.. మల్టీఫ్లెక్సులు.. హ్యాంగౌట్ ప్లేస్ లు బోసి పోవ‌టం క‌నిపిస్తోంది.

వారాంతం వ‌చ్చిందంటే చాలు.. ప‌బ్ ల ద‌గ్గ‌ర సంద‌డి మామూలుగా ఉండ‌దు. అలాంటిది శ‌నివారం రాత్రి ఫేమ‌స్ ప‌బ్ ల ద‌గ్గ‌ర ర‌ద్దీ ఒక మోస్త‌రుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. సో.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా సంక్రాంతికి అంద‌రూ సొంతూరు బాట ప‌ట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News