మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌ ఎంత నష్టపోతోందంటే!

Update: 2020-03-11 06:00 GMT
ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన మార్చిలో ఆదాయం పెంచుకునేందుకు అన్ని రాష్ట్రాలూ ప్రయత్నాలూ చేస్తాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం అనుకోని పరిస్థితుల్లో ఈ నెలలోనే భారీగా ఆదాయాన్ని కోల్పోబోతోంది. అవును... ఇప్పటికే ఏపీలో మద్యంపై నియంత్రణల కారణంగా ఆదాయం తగ్గగా.. ఇప్పడు మార్చి నెలలో ఏకంగా 18 రోజులు మద్యం దుకాణాలు మూతపడనుండడంతో భారీగా ఆదాయానికి దెబ్బ పడుతోంది. రూ. 400 కోట్లకు పైగా నష్టం తప్పదని భావిస్తున్నారు.

స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులను బంద్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. మూడు దఫాలుగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్‌పిటీసి, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే 18 రోజుల పాటు మద్యం అమ్మకాలు ఉండవు.

రాష్టంలో ప్రస్తుతం 4,200 లిక్కర్ షాపులు, 800కు పైగా బార్‌లూ ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తోంది. వైన్ షాపులు తగ్గాలి, ఆదాయం మాత్రం తగ్గకూడదు, ఇదే ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు పెట్టుకున్న టార్గెట్. ఇందుకు తగ్గట్టుగా పాలసీ రూపొందించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే 3,500 షాపులను అధికారికంగా నిర్వహిస్తోంది. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేసింది. ఇక ధరలు చూసినట్లైతే.. ఏపీలో క్వార్టర్ సీసా గతంలో రూ.100 అమ్ముడు అయింది. కానీ పెరిగిన ధరల కారణంగా క్వార్టర్ రూ.160 పెట్టి విక్రయిస్తున్నారు. రాయల్ స్టాగ్ క్వార్టర్ గతంలో రూ.150 కాగా ఇప్పుడు రూ. 170కి చేరింది. గతంలో రూ. 100కు అమ్ముడైన బీరును రూ. 160కి విక్రయిస్తున్నారు. ఏపీలో 2018-19లో 12.96 శాతం వృద్ధితో రూ.17.340 కోట్ల ఆదాయం వచ్చింది.

2018-19లో వచ్చిన ఆదాయం రూ. 6,222 కోట్లు కాగా 2019-20లో ఎక్సైజ్ ఆదాయం 8,518 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏపీ రాష్ట్ర ఆదాయం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అయితే కేవలం రూ.20 వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల వల్లే వస్తోంది. ఒక్క జనవరి 1వ తేది వేడుకల్లోనే ఏపీలో దాదాపు 100 కోట్ల విలువైన మద్యం తాగారని ఎక్సైజు శాఖ లెక్కలు చెబుతున్నాయి.

అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేయడం వల్ల ఏపీకి భారీగా నష్టం వాటిల్లనుంది. వైన్ షాపుల వల్ల వచ్చే ఆదాయం తగ్గనుంది. రోజుకు దాదాపు గా 23 కోట్ల ఆదాయం వైన్ షాపుల వల్లే రానుంది. అంటే నెలకు 709 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 18 రోజులు ఏపీలో వైన్ షాపులు మూసి వేయడం వల్ల 414 కోట్ల రూపాయలు ఆదాయం రాకుండా పోనుంది.


Tags:    

Similar News