హుజూర్ నగర్ ఓటుకు రేట్ ఎంత.?

Update: 2019-10-19 08:18 GMT
తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక హుజూర్ నగర్.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ కాంగ్రెస్ సీటును దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు తమ సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులంతా విభేదాలు మరిచి ఒక్కతాటిపైకి వచ్చి హుజూర్ నగర్ లో ప్రచారం మొదలుపెట్టారు.

టీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డినే మళ్లీ బరిలోకి దింపి ఓడిపోయిన సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలని.. అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతినే బరిలోకి దింపి చేజారిపోకుండా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇటు టీఆర్ఎస్  అభివృద్ధి మంత్రం ఫలిస్తుందా.. అటు బలమైన ఉత్తమ్ తన నియోజకవర్గాన్ని గులాబీకి దక్కకుండా కాపుకాస్తాడా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఇక మధ్యలో బీజేపీ, టీడీపీ కూడా తలో చేయి వేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ ఆగడాలను ఈసీ, ప్రత్యేక అధికారులతో కల్లెం వేసింది. టీఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెడుతోంది. టీడీపీ కూడా ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇక ప్రజాసంఘాల నుంచి మల్లన్న సహా కొన్ని చిన్న పార్టీలు బరిలోకి దిగాయి.

ఇంత టైట్ ఫైట్ లో హుజూర్ నగర్ ఓటర్లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో ఓటు ఎంతో కీలకంగా మారింది. బలమైన ప్రత్యర్థులు పోటీపడుతున్న ఈ చోట ఒక్కో ఓటుకు 2000 నుంచి  3000  దాకా పంచేందుకు పార్టీలు సిద్ధం చేశాయన్న ప్రచారం సాగుతోంది. ఈసీ డేగ కళ్లను తప్పించుకొని ఓటర్లకు పంచడానికి ఇప్పటికే నోట్ల కట్టలు హుజూర్ నగర్ చేరాయని ఇన్ సైడ్ టాక్.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళనే ఓటుకు 2 వేల నుంచి 3 వేల దాకా దక్కించుకున్న హుజూర్ నగర్ ఓటర్లు మళ్లీ ఇప్పుడు సంవత్సరం తిరగకముందే మరోసారి అంతే మొత్తాన్ని అందుకుంటున్నారు. నేతల చేతిచమురు మాత్రం వదులుతోంది. మరి ఈ టఫ్ ఫైట్ లో గెలుపు ఎవరిదైనా హుజూర్ నగర్ ఓటర్ల పంట పడడం  మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News