బాల్యంలో పిల్లలకు నీతా అంబానీ ఇచ్చిన పాకెట్ మనీ ఎంతంటే?

Update: 2022-07-10 04:26 GMT
దేశంలో అత్యంత సంపన్నులు ఎవరన్న వెంటనే.. మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు ముకేశ్ అంబానీ. అపర కుబేరులుగా మారుతున్న వారు.. రోజులు గడిచే కొద్దీ సంపదను అంతకంతకూ పెంచేసుకుంటూ పోవటమే కాదు.. ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ టెన్ వరకు వెళ్లగలిగారు. తన తండ్రి ధీరూబాయ్ అంబానీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యాపార వ్యూహాల్ని సిద్ధం చేసే ముఖేశ్ అంబానీ.. ధీరూభాయ్ అంబానీకి అసలుసిసలు వ్యాపార వారసుడిగా చెప్పక తప్పదు.

సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెబుతారు. భర్తకు తగ్గట్లుగా వ్యవహరించే భార్య నీతా అంబానీ వైఖరి ఉంటుందని చెబుతారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తల్లి నీతూ అంబానీ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు రిలయన్స్ జియోకు ఛైర్మన్ గా కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న అకాశ్ అంబానీ.

తన పేరును ఆకాశ్ గా ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ''అమ్మానాన్నలకు నేనూ ఈశా కవలలుగా ఐవీఎఫ్ పద్దతిలో పుట్టాం. మేమిద్దరం పుట్టే సమయానికి నాన్న విమానం ఆకాశంలో పర్వతాల మధ్య జర్నీ చేస్తోంది. దీంతో అబ్బాయి పుడితే అకాశ్ అని.. అమ్మాయి పుడితే ఈశా అని పేరు పెట్టాలని అనుకున్నారు. నేను ఆకాశమైతే.. తను పర్వతాలకు దేవత. మా తర్వాత పుట్టిన తమ్ముడికి అనంత్ పని పేరు పెట్టారు'' అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఆకాశ్. తమ చిన్నతనంలో స్కూలుకు వెళ్లే వేళలో.. తమ ముగ్గురికి అమ్మ ఇచ్చే పాకెట్ మనీ గురించి నమ్మలేని విషయాల్ని వెల్లడించారు. తాము ధనవంతులమన్న విషయాన్ని.. నాన్నకు వ్యాపార రంగంలో చాలా పెద్ద పేరు ఉందన్న విషయాన్ని తమకు చెప్పలేదన్నారు. చిన్నతనంలో ప్రతి శుక్రవారం స్కూలు క్యాంటీన్ లో కొనుక్కోవటానికి తమ ముగ్గురికి రూ.5 చొప్పున మాత్రమే అమ్మ ఇచ్చేదని చెప్పారు. ఇది చూసిన మిగిలిన పిల్లలు తమతో.. మీరు నిజంగానే అంబానీ పిల్లలేనా? అని అడిగేవారన్నారు.

తమ తోటి పిల్లలు తమ కంటే ఎక్కువ డబ్బులు తెచ్చుకునేవారని.. ఒకసారి అనంత్ ఇదే విషయాన్ని తమ తల్లికి చెబితే.. విని ఊరుకుందే తప్పించి మరో రూ.5 ఇవ్వలేదు. తర్వాత ప్లస్ టూలో ఉన్నప్పుడు రిలయన్స్ మీద ఒక వ్యాసం రాయాల్సి వచ్చింది. అప్పుడే తామెంత ధనవంతులమన్న విషయం తొలిసారి తనకు తెలిసిందని చెప్పారు. అయినప్పటికీ తమ మీద ధనవంతులమన్న భావన తమ మనసుల్లోకి రాకుండా అమ్మ జాగ్రత్త పడేదని.. చిన్న తప్పు జరిగినా వెంటనే మందలించేదని చెప్పారు.

అందుకే అమ్మకు టైగర్ మామ్ అని పిలుచుకుంటామని చెప్పుకొచ్చారు. అంబానీ అంతటోళ్లే.. పిల్లలకు డబ్బుల విషయంలో ఎంతటి జాగ్రత్తలు నేర్పారన్న విషయం ఆకాశ్ మాటల్ని విన్నంతనే అర్థం కాక మానదు. పిల్లలకు డబ్బు విలువ తెలిపే విషయంలో అందరూ ఎలా వ్యవహరించాలన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News