భార‌త్‌-పాక్ క్రికెట్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం అయితే న‌ష్ట‌మెంతంటే?

Update: 2019-06-15 11:56 GMT
ఇంగ్లండ్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్నీలో ఫైన‌ల్ కంటే మిన్న‌గా.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించే మ్యాచ్ ఏదైనా ఉందంటే భార‌త్ -పాక్ మ‌ధ్య ఆదివారం జ‌రిగే మ్యాచ్ గా చెప్పాలి. దాయాది దేశాల మ‌ధ్య జ‌రిగే పోరు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందులోకి ఇటీవ‌ల రెండు దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌డీ పోరు కోట్లాదిమంది భావోద్వేగాల‌తో ముడిప‌డిన ప‌రిస్థితి.

ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వారికి వ‌ర్షం ఇప్పుడు అనుకోని విల‌న్ గా మారింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ క‌ప్ టోర్నీ మీద వ‌ర్షం తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది. మెగా టోర్నీ స్టార్ట్ అయిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే నాలుగు మ్యాచ్ లు ర‌ద్దు అయ్యాయి.

దీంతో న‌ష్టం భారీగా న‌మోదైంది. ఇదిలా ఉంటే.. రేపు (ఆదివారం) జ‌రిగే మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. త‌మ ప‌నుల్ని వాయిదా వేసుకొని మ‌రీ మ్యాచ్ ను వీక్షించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకున్న వారు కూడా లేక‌పోలేదు. ఇదంతా అభిమానుల ఉత్సాహం అయితే..  వ్యాపార‌ప‌రంగా చూస్తే.. ఈ మ్యాచ్ ర‌ద్దు అయితే న‌ష్టం భారీగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ర‌ద్దు అయిన నాలుగు మ్యాచ్ ల కార‌ణంగా రూ.140 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా లెక్క‌లు వేస్తున్నారు. ఇక‌.. ఆదివారం జ‌రిగే మ్యాచ్  క‌నుక క‌వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన ప‌క్షంలో సుమారు రూ.137 కోట్ల మేర వ్యాపార న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఈ న‌ష్టంలో అత్య‌ధికంగా స్టార్ స్పోర్ట్స్ ఛాన‌ల్ మీద ప‌డుతుంద‌ని చెబుతున్నారు.అయితే.. అంత న‌ష్టం ఉండ‌ద‌ని.. ఆ ఛాన‌ల్ ఇలాంటి ప్ర‌మాదాల్ని ఊహించి ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా బీమా చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇంత భారీ ఎత్తున న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చేందుకు బీమా సంస్థ‌లు కూడా సిద్ధంగా లేవ‌ని చెబుతున్నారు.

స్టార్ స్పోర్ట‌స్ తో ప్ర‌క‌ట‌న‌ల ఒప్పందం చేసుకున్న కోకాకోలా.. ఉబ‌ర్.. వ‌న్ ప్ల‌స్.. ఎమ్మ‌ర్ ఎఫ్ టైర్స్ వంటి కంపెనీలు న‌ష్ట‌పోతాయ‌ని చెబుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ల సంద‌ర్భంగా స్పోర్ట్స్ ఛాన‌ల్ లో 5500 సెక‌న్ల‌ పాటు యాడ్ కంపెనీల‌కు స‌మ‌యాన్ని కేటాయిస్తార‌ని చెబుత‌న్నారు. స్టార్ స్పోర్ట్స్ సంస్థ ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ ల‌కు ఒక సెక‌నుకు రూ.1.6లక్ష‌ల నుంచి రూ.1.8ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేస్తార‌ని చెబుతున్నారు.  భార‌త్‌-పాక్ ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ ల‌కు ఈ మొత్తం సెక‌న్ కు రూ.2.5ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తార‌ని తెలుస్తోంది. వ‌ర్షం కురిస్తే.. మ్యాచ్ జ‌ర‌గ‌దు కాబ‌ట్టి.. ఈ ఆదాయం మొత్తానికి గండి ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో.. రేపు జ‌రిగే మ్యాచ్ వ‌ర్షం ప‌డ‌కూడ‌ద‌ని కోట్లాది మంది అభిమానులే కాదు.. వాణిజ్య సంస్థ‌లు గ‌ట్టిగానే వేడుకుంటున్నాయ‌ని చెప్పాలి.
Tags:    

Similar News