అన్న పైపైకి..త‌మ్ముడు పాతాళానికి..అంబానీ సోద‌రుల క‌థ‌!

Update: 2019-08-12 09:44 GMT
వ్యాపారాలు కూడా రాజ‌కీయాల మాదిరిగా త‌యార‌య్యాయ‌ని అంటారు నిపుణులు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. రాత్రికి రాత్రి కోటీశ్వ‌రులు అయిన‌వారు అదే రాత్రిలో అతః పాతాళానికి చేరిపోయిన వారు బిజినెస్‌ లో కోకొల్లలు. అప్పుల కుప్ప‌లు త‌ట్టుకోలేక‌.. ఇటీవ‌ల కేఫ్ కాఫీ డే య‌జ‌మాని ఆత్మ‌హ‌త్య ఈ కోవ‌లేదో. ఇప్పుడు అచ్చు ఇలాంటి ఘ‌ట‌నే రిల‌య‌న్స్ కుటుంబంలో జ‌రిగింది. ధీరూభాయ్ అంబానీ వార‌సులుగా బిజినెస్ రంగంలోకి వ‌చ్చిన అనిల్‌ - ముఖేష్‌ లు.. వాటాలు పంచుకుని - వ్యాపారాల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రికీ కూడా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ నేప‌థ్యంలోనే అనేకానేక ప్రాజెక్టులతో ఒప్పందం కూడా చేసుకున్నారు.

అయితే, అన్న ముఖేష్ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. త‌న ప‌థాన్ని పైపైకి విస్త‌రించుకుని ముందుకు సాగుతుంటే.. త‌మ్ముడు అనిల్ మాత్రం.. ప్ర‌తి అడుగులోనూ అతః పాతాళాన్ని చ‌విచూస్తు న్నారు. ఇటీవ‌ల కేంద్రాన్ని కుదిపేసిన ఎఫ్‌-2 యుద్ద‌విమానాల ప్రాజెక్టు అనిల్‌దే. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఫ్రాన్స్ స‌హా ఇత‌ర దేశాలు కూడా దీనిలో విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఇక‌, ఇప్పుడు ఆయ‌న బిజినెస్ స్టాక్ మార్కెట్‌ లో ఘోరంగా ప‌డిపోయింది. వ్యాపారంలో వరుస నష్టాలు - రుణభారం  వెరసి అనిల్‌ అంబానీ ఆయన వరుసగా ఆస్తులు - కంపెనీలలో షేర్లను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తాజాగా  ఆడిటర్ల రూపంలో మరో షాక్‌ తగిలింది.  రిలయన్స్ గ్రూపునకు చెందిన అను సంబంధ కంపెనీలైన రిలయన్స్ పవర్ - రిలయన్స్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్లకు చెందిన ఆడిటర్లు రాజీనామా చేశారు.  గత మూడు నెలలుగా చట్టబద్దమైన ఆడిటర్లుగా తప్పు కోవడం పెద్ద దెబ్బే. తాజాగా మరో రెండు కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు నెలల్లోనే  రిలయన్స్ గ్రూప్‌ లోని నాలుగు కంపెనీల ఆడిటర్లు వైదొలిగినట్లు అయింది. కంపెనీకి చట్టబద్ధమైన ఆడిటర్లలో ఒకరైన బీఎస్ ఆర్‌ అండ్‌ కం 2019 ఆగస్ట్ 9వ తేదీ నుంచి వై దొలిగిందని  రిలయన్స్ ఇన్‌ ఫ్రా -  రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్‌ చెంజ్‌ సమాచారంలో వెల్లడించాయి.

ఈ మేరకు ఆడిటర్లు కంపెనీలకు ఒక లేఖ రాసినట్టు తెలిపింది. చిత్రం ఏమిటంటే.. ఒకవైపు రిలయన్స్‌ అధినేత  అనిల్ అన్న‌ ముకేశ్‌ అంబానీ  పట్టిందల్లా బంగారంలా  దూసుకుపోతున్నారు. పెట్రో కెమికల్‌ బిజినెస్‌ లో 20 శాతం విదేశీ పెట్టుబడులను పెట్టబోతున్నట్లు  అంబానీ ప్రకటించారు. దుబాయ్‌ కంపెనీ సౌదీ అరామ్‌ కో ద్వారా  మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తన కంపెనీని అప్పుల్లేని కంపెనీగా తీర్చదిద్దుతామని వెల్లడించారు. అదే రోజు ఇలా అనిల్ కంపెనీల నుంచి ప్ర‌ముఖ ఆడిట‌ర్లు రాజీనామా చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చకు దారితీస్తోంది.


Tags:    

Similar News