ఇండియాకు సోనియా గాంధీ ఎలాగో...షర్మిల కూడా తెలంగాణాకు అంతేనా...?

Update: 2022-07-13 17:30 GMT
ఈ పోలిక ఎందుకో బాగా  అతికినట్లుగా కనిపిస్తోంది.  ఇద్దరూ కోడళ్లే. ఇద్దరూ మూలాలు వేరే చోట ఉన్న వారే. ఇద్దరూ మరో చోట రాజకీయ దూకుడు చేసే వారే. అందుకే సోనియాతో షర్మిలకు పోటీ పెట్టి విశ్లేషణలు చాలా వస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదనా కూడా సోనియా గాంధీ ఈ దేశానికి కోడలు. ఆమె మూలాలు ఇటలీ దేశంలో ఉన్నా ఆమెను రాజీవ్ గాంధీ వివాహం చేసుకోవడంతో ఆమె భారత్ వచ్చేశారు. ఆ విధంగా ఆమె మెట్టినిల్లు ఇండియాగా చెప్పాలి. అంటే ఆమె ఇండియాకు కోడలన్న మాట.

అలాంటి సోనియా గాంధీ ఎంతో కష్టపడి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు. ఆమె నాడు కోరుకుంటే ప్రధాని అయ్యేవారు. కానీ ఆమె విదేశీయురాలు, భారతీయురాలు కాదు కాబట్టి ఆ పదవిని చేపట్టడానికి ఆమెకు ఏ రకమైన హక్కు లేదు అంటూ విపక్షాలు నాడు నానా యాగీ చేశాయి. దాంతో సోనియాగాంధీ మనసు మార్చుకున్నారు. తన ప్లేస్ లో మన్మోహన్ సింగ్ ని పెట్టి ప్రధానిగా అయన్ని చేసి తాను తెర వెనక చక్రం తిప్పారు.

ఇదంతా ఎందుకు అంటే ఇపుడు వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవడానికే. ఆమె తెలంగాణా కోడలుని అంటున్నారు. అంటే ఆమె ఆంధ్రా మూలాలను ఈ విధంగా కవర్ చేసుకోవాలని చూస్తున్నారు అన్న మాట. ఆమె కడప బిడ్డ అని అందరికీ తెలిసిందే. ఆమె తండ్రి వైఎస్సార్ సీమ ప్రాంతానికి చెందిన నాయకుడు అని వేరేగా చెప్పాల్సింది లేదు.

అసలు వివాదాలు గొడవలు, నీరు నియామకాలతో పాటు ఆంధ్రా సీమ జిల్లాల నేతల పెత్తనం తట్టుకోలేకనే తెలంగాణా ఉద్యమం వచ్చిందని అంతా చెబుతారు. అదే నిజం కూడా మరి తెలంగాణా వచ్చినా కూడా ఆంధ్రా మూలాలు ఉన్న వారికే నాయకత్వం ఇచ్చేందుకు జనాలు సిద్ధంగా ఉంటారా అంటే అసలు కుదరదు అనే జవాబు వస్తోంది.

ఇసుకనైనా  తైలం తీయడం సులువు ఏమో కానీ తెలంగాణాలో ఆంధ్రా  రాజకీయం పండించడం బహు కష్టం అన్న్న సంగతి షర్మిలకు ఈ రోజుకు అయితే అర్ధం కాకపోవచ్చు అనే అంటున్నారు. ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబు లాంటి వారు కూడా తెలంగాణాలో ఎందుకు రాజకీయం చేయలేకపోతున్నారు అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

చంద్రబాబు కుమారుడు లోకేష్ పుట్టింది తెలంగాణాలో, కోడలు బ్రాహ్మణి పుట్టింది కూడా అక్కడే. అయినా సరే ఆ మాటలు చెప్పి వారు టీడీపీని అక్కడ స్ట్రాంగ్ చేయగలరా. అంటే తెలంగాణావాదం అంత బలంగా  ఉంది మరి. అక్కడ ఉన్న పార్టీలు ఏమైనా కొట్లాడుకోవచ్చు, పోటీ చేయవచ్చు. జనాలు అవకాశం ఇస్తే నెగ్గి గద్దెనెక్కవచ్చు.

కానీ ఆంధ్రా మూలాలు ఉన్న వారు వచ్చి పార్టీ పెట్టి సీఎం పోస్టునకు ఎర వస్తే మాత్రం జనాలు ససేమిరా అంటారు అని అంటున్నారు. రెండు ఎన్నికలు జరిగిపోయాయి కదా తెలంగాణావాదం పోయింది అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అంటున్నారు. 1969లో తొలివిడత తెలంగాణా ఉద్యమం జరిగింది. ఆ తరువాత దాన్ని అణచేశారు. కానీ రెండవ విడత ఉద్యమం 2000 తరువత భారీ ఎత్తుల లేచి రాష్ట్రం సాధించేంటవరకూ ఆ పోరాటం సాగలేదా అన్నది చరిత్ర చెబుతున్న చేదు నిజం.

రాజకీయాలు అసంతృప్తులు, వివాదాలు, గొడవలు, ఇలా ఎన్ని ఉన్నా కానీ తెలంగాణా అస్థిత్వం మీద వాటి ప్రభావం అసలు పడనే పడదు అంటున్నారు. తెలంగాణా జనాలు అక్కడ తమ చైతన్యాన్ని బాగా చూపిస్తారు అనే చెబుతున్నారు. అందువల్ల తెలంగాణాలో పార్టీ పెట్టి షర్మిల చేస్తున్న రాజకీయం ఫలితాలు ఎలా ఉండబోతాయన్నది తొందరలోనే అందరికే అర్ధం అవుతుంది అనే అంటున్నారు. సోనియా అధికారిక హోదాని ఏ రకంగా అందుకోలేకపోయారో అదే మాదిరిగా షర్మిల విషయంలో జరిగినా జరగవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News