గూగుల్ ఉద్యోగానికి పిచాయ్ చెప్పిన ఆన్స‌ర్ ఇది!

Update: 2017-01-05 19:30 GMT
ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ప‌ని వాతావ‌ర‌ణం క‌లిగిన ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల్లో గూగుల్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో జాబ్ చేయాల‌ని కోరుకోని టెకీ ఉండ‌డు. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ స్టూడెంట్స్ కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ప్ర‌స్తుతం వాళ్ల క్యాంప‌స్‌ కే వ‌చ్చిన గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌ నే ఓ విద్యార్థి ఆ ప్ర‌శ్న అడిగాడు. గూగుల్‌ లో జాబ్ రావాలంటే ఏం చేయాలి అని. అయితే దీనికి పిచాయ్ స‌మాధానం చెప్ప‌కుండా ఆ విద్యార్థి వైపు వింత‌గా చూసి త‌న ఇంట‌ర్వ్యూ విష‌యం చెప్పుకొచ్చారు.

2004లో గూగుల్ ఇంట‌ర్వ్యూకి వెళ్లిన‌పుడు త‌న అనుభ‌వాన్ని ఈ సంద‌ర్భంగా పిచాయ్ వివ‌రించారు. 2004, ఏప్రిల్ 1న సుంద‌ర్ గూగుల్ ఇంట‌ర్వ్యూకి వెళ్లారు. అయితే అన్ని రౌండ్ల ఇంట‌ర్వ్యూల్లోనూ సుంద‌ర్‌ను ఓ ప్ర‌శ్న బాగా ఇబ్బంది పెట్టింది. అది జీమెయిల్ గురించి తెలుసా? అని. అయితే అప్పుడ‌ప్పుడే జీమెయిల్‌ను గూగుల్ ప్రారంభించింది. దాని గురించి తెలియ‌క అదేదో ఏప్రిల్ ఫూల్ జోకేమో అనుకొని తాను ఏమీ చెప్ప‌లేద‌ని సుంద‌ర్ అన్నారు. అయితే నాలుగో రౌండ్ ఇంట‌ర్వ్యూ జ‌రిగే స‌మ‌యంలోనూ ఇదే ప్ర‌శ్న ఎదురైంద‌ని, అప్పుడు ఇంట‌ర్వ్యూవ‌ర్ త‌న‌కు జీమెయిల్ ఎలా ఉంటుందో చూపించార‌ని సుంద‌ర్ చెప్పారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఇంట‌ర్వ్యూల్లో తాను జీమెయిల్‌ ను ఎలా డెవ‌ల‌ప్ చేయాలి అన్న అంశంపై స‌మాధానం ఇవ్వ‌డం ప్రారంభించాన‌ని తెలిపారు. మ‌ధ్య‌లో త‌న‌కు ఐస్‌ క్రీమ్ కూడా ఆఫ‌ర్ చేశార‌ని అప్పుడే గూగుల్‌ లో ప‌నిచేయ‌డం ఎలా ఉంటుందో తెలిసిపోయింద‌ని సుంద‌ర్ పిచాయ్ చెప్పారు. గూగుల్ ఫౌండ‌ర్ లారీ పేజ్ ఇంట‌ర్వ్యూ చేయ‌ని అతికొద్ది మంది ఎంప్లాయీస్‌లో తాను ఒక‌డిన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు.

గూగుల్‌లో జాబ్ ఎలా సంపాదించాలో చెప్ప‌క‌పోయినా.. ఎంత‌మందికి గూగుల్‌లో ప‌నిచేయాల‌ని ఉంది అని మాత్రం సుంద‌ర్ అడిగారు. అప్పుడు చాలా మంది చేతులు ఎత్తారు. ఇలా అయితే తాను ఖ‌ర‌గ్‌పూర్‌లో ప్రత్యేకంగా క్యాంప‌స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంద‌ని సుంద‌ర్ చ‌మ‌త్క‌రించారు. మ్యాథ‌మెటిక్స్ ప్ర‌ధాన స‌బ్జెక్ట్‌ గా ఉండి కంప్యూట‌ర్ సైన్స్‌ తో సంబంధంలేని స్టూడెంట్ జాబ్ కొట్ట‌గ‌ల‌డా అని మ‌రో విద్యార్థి సుంద‌ర్‌ ను ప్ర‌శ్నించాడు. ఏం ప్రాబ్లం లేదు.. ఆర్టిపిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ - మెషిన్ లెర్నింగ్‌లాంటి అంశాల్లో మ్యాథ్స్ ఉంటుంద‌ని, అందువ‌ల్ల మ్యాథ‌మెటీషియ‌న్‌కు కోడింగ్ నేర్ప‌డం ఇంకా ఈజీన‌ని సుంద‌ర్ పిచాయ్ వారిలో ధైర్యం నింపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News