ఎవరయ్యా ఏపీ కాంగ్రెస్ పనైపోయిందన్నది?

Update: 2019-02-16 04:42 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రస్తుతానికి టీడీపీ - వైసీపీల మధ్యే రాజకీయ వార్‌ సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సీనియర్‌ నాయకులు సైతం వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీకి జోష్‌ నింపే సంఘటన ఒకటి జరిగింది. ఇప్పటివరకు తమ పార్టీని ఎవరూ పట్టించుకోరన్న నిరాశవదనంలో ఉన్న నాయకులకు ఈ సంఘటనతో ఉత్సాహం నింపినట్లయింది. ఇంతకీ ఏంటా సంఘటన..అంటే..?

గత డిసెంబర్‌లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్‌  బరిలోకి దిగింది. అయితే ఏపీలో మాత్రం ఒంటరిగానే పోటీ పడతామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు ఇక తమ పార్టీ అధికారంలో రావడం ఖల్లా అని నిట్టూర్చుతున్నారు. ఈ సమయంలో కొందరు పార్టీని వీడి టీడీపీ - వైసీపీలోకి వెళుతుండగా మరి కొందరు పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఏపీపీసీసీ ఒక బృహత్తర ప్రణాళిక చేపట్టింది. తమ పార్టీ తరుపున పోటీ చేసేందుకు దరఖాస్తులను కోరింది. అసెంబ్లీ స్థానానికి రూ.2 వేలు - ఎంపీ స్థానానికి రూ.5వేలు దరఖాస్తు ఫీజుగా ప్రకటించింది. అయితే ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు ఊహించనంతగా ఈనెల 13 వరకు 1272 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో దరఖాస్తుదారుల ఉత్సాహాన్ని గమనించిన రాష్ట్ర పార్టీ మరో మూడు రోజులు గడువు పెంచింది. దీంతో మొత్తం ఎమ్మెల్యే స్థానానికి 1092 - ఎంపీ స్థానానికి 182 అప్లికేషన్లు వచ్చాయట. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా..? లేదా..? అని కాంగ్రెస్‌ నాయకులు కలవరపడుతున్న సమయంలో ఈ అప్లికేషన్లు చూసి సంబరపడిపోతున్నారట.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపుపై ఎలాంటి ఆశ లేకున్నా ఇన్ని అప్లికేషన్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తుండగా..  ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవచ్చు.. కానీ కేంద్రంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చోటా మోటా నాయకులు కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి ఓడిపోయినా భవిష్యత్తులో కేంద్రం అండంతో ఏదో ఒక పదవిని పొందవచ్చని భావిస్తున్నారు. ఏ పదవి లేకునా ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి అనే హోదాతోనైనా పేరుకు రావచ్చని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ మాత్రం ముందుగా పార్టీలోని సీనియర్‌ నాయకులకు అవకాశం ఇచ్చాకే మిగతావారికని అంటోంది. కొత్తవారితో ప్రజల్లోకి వెళ్లే కంటే సీనియర్‌ నాయకులతో ఎన్నికల బరిలోకి దిగితే కొంతైనా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు చేస్తుందని హైకమాండ్‌ ప్రకటించడంతో కొందరు నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పుడు అప్లికేషన్ల వ్యవహారం చూసిన తరువాత కాంగ్రెస్‌ తరుపున పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.



Tags:    

Similar News