గెలుపెవరిది?.. రంగంలోకి బెట్టింగ్ రాయుళ్లు

Update: 2018-11-26 11:35 GMT
తెలంగాణ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అన్ని స్థానాల్లో పార్టీలు బలమైన అభ్యర్థులను నిలబెట్టామని - పోటీ కష్టతరంగా ఉంటుందని చెప్పుకుంటున్నాయి. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వివిధ సర్వేలు బయటకు వస్తున్నాయి. గెలుపు గుర్రాలు వీరేనంటూ ప్రచారం జరుగుతోంది. అదే ఊపులో రంగంలోకి దిగారు బెట్టింగ్ రాయుళ్లు.

అభ్యర్థి గెలుపోటములను అంచనా వేస్తూ  రూ.కోట్లలో బెట్టింగ్ లు సాగుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు - పార్టీ ముఖ్యులు ఉన్న స్థానాలపై ఆసక్తి బాగా పెరిగింది. కుల మతాల పరంగా ఓట్లను - వైఫల్యాలను - లాభ నష్టాలను బేరీజు వేస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటూ తలబడుతున్న ఉద్ధండుల స్థానాలపై బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నాయి. 

ముఖ్యంగా బెట్టింగ్ లు కాంగ్రెస్ - టీడీపీ - టీఆర్ ఎస్ నేతలపైనే బెట్టింగ్ లు సాగుతున్నాయి. ఎన్నికలు కూడా వారి మధ్యే జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలు ప్రతిపక్షాలు ప్రతిష్ఠగా తీసుకోగా - అధికార పార్టీ నేతలకు పరువు సమస్యగా మారింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని   నాగార్జునసాగర్‌ ప్రాంతంపై బెట్టింగ్ లు ఎక్కువగా జరుగుతున్నాయట.  కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి - టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య మధ్య పోటీ తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం. వరుసగా ఎనిమిదోసారి గెలుపు అందుకునేందుకు జానారెడ్డి ఉవ్విళ్లూరుతుంటే..  అడ్డుకట్టవేస్తానని నర్సింహయ్య అంటున్నారు.

హుజూర్‌ నగర్‌ లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన స్థానంపై కూడా ఎక్కువగా బెట్టింగ్ లు సాగుతున్నాయట.  ఈయనపై  టీఆర్‌ ఎస్‌ నుంచి  ఎన్నారై సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.    సీనియర్‌ నేత కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిపై టీఆర్‌ ఎస్‌ తరుపున బరిలో ఉన్న కంచర్ల భూపాల్‌ రెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.  ఇంకా మరికొన్ని స్థానాల్లో బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. మహా కూటమి - టీఆర్ ఎస్ లలో ఏ పార్టీ గెలుస్తుందో అన్న దానిపై కూడా  రూ.కోట్లో బెట్టింగ్ లు జరుగుతున్నాయి.
Tags:    

Similar News