కార్తీకం.... ఎన్నికలకు వ్యతిరేకం...!!

Update: 2018-11-18 17:30 GMT
కార్తీకం మాసం. శివుడికి ప్రీతిపాత్రమైన మాసం. అంతే కాదు....భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్లాడమే కాదు ఈ నెల రోజుల పాటు మాంసాహారాన్ని కూడా వదిలేస్తారు హిందువులు. అత్యంత భక్తితో శివుడ్ని ఆరాధించడమే కాదు.... ఎంతో పవిత్రంగా నియమనిష్టలను సైతం పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. వన భోజనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కార్తీక మాసంలో ఏ ఒక్కరు కూడా మాంసాహారం జోలికి వెళ్లకుండా ఈ వేడుకను జరుపుకుంటారు. కార్తీక మాంసం తెలుగు వారందరికి ఎంతో పవిత్రమైన మాసం. అయితే అంతటి పవిత్ర కూడా ముందస్తు ఎన్నికల పుణ్యమాని కోల్పోతుంది. అవును... నిజం కార్తీక మాసంలో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో మాసం అమ్మకాలు గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగాయంటున్నారు. గత కార్తీక మాసాలతో పోలిస్తే ఈ ఏడాది కార్తీక మాసంలో మాంసం విక్రయాలు విపరీతంగా పెరిగాయంటున్నారు. దీనికి కారణం ముందస్తు ఎన్నికలే.

అభ్యర్ధుల ప్రకటన కూడా పూర్తి అయిపోవడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు విందు రాజకీయాలకు తెర తీసారు. విందంటే పప్పు - దప్పడం - వంకాయ కూర - రెండు రకాల స్వీట్లతో ఇచ్చేస్తే సరిపోదు కదా. అందులోనూ ఎన్నికల విందాయే. మందు - మాంసాహారం లేకపోతే కాలనీల నాయకులు - ఓటర్లు మన మాట ఎందుకు వింటారనుకున్నారో ఏమో కాని తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనూ - రాజధానిలోని వివిధ కాలనీల్లో మాంసాహారంతో విందులు ఎక్కువయ్యాయంటున్నారు. ఆన్ లైన్ ఫుడ్ సప్లయిర్స్ జుమాటో - స్విగీ - ఊబర్ ఈట్స్ ఫుడ్ పాండా వంటి సంస్ధలకు చేతి నిండా పనికి పని - ఆదాయానికి ఆదాయం వస్తోందంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ సంస్ధలకు రాత్రి వేళల్లో వ్యాపారం గతంతో పోలిస్తే మరింత పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఖర్చుపై ఎన్నికల కమిషన్ డేగ కన్ను సారించడంతో అభ్యర్ధులు ఈ పార్టీల పనిని తమ విధేయులకు అప్పగిస్తున్నారంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధుల  అనుచరులు ఆన్ లైన్ లో చికెన్ బిర్యానీలు - మటన్ బిర్యానీలు - కబాబ్ - ఇంకా ఇతర మాంసాహార వంటకాలను ఆర్డర్ చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో కార్తీమ మాసం పవిత్రత - మహా శివుడి ఆరాధన కంటే ముందస్తు ఎన్నికలే ప్రజలకు ఎక్కువయ్యాయని తేలింది. శంభో శంకరా.... ఎన్నికల ముందు కార్తీక మాసం పవిత్రత  కూడా హారతి కర్పూరంలా కరిగిపోతోంది.

   

Tags:    

Similar News