అది 2004కు ముందు.. అప్పటికే 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా మనుగడ సాగించలేని టైం.. ఎలా వచ్చిందో కానీ పవర్ ఫుల్ ఆయుధాన్ని బయటకు తీశాడు. ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.. గ్రాండ్ సక్సెస్.. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలతో తిరుగులేని రాజకీయ నేతగా వెలుగొందారు.. అక్కడికి కట్ చేస్తే..
అదే సీన్.. వైఎస్ చలవతో రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుకు వైఎస్ ఆయుధమే దిక్కైంది. 2012 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ 13 జిల్లాలు తిరిగి 2013 ఏప్రిల్ 28న విశాఖలోని ఆగనపూడి వద్ద ముగించారు. 2014లో ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయినా విభాజిత ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు.. అదీ పాదయత్ర మహిమే..
ఇప్పుడూ అదే ఆయుధం.. తండ్రి చూపిన దారిలో కొడుకు జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను మొదలు పెట్టారు. రాయలసీమ దాటి ఆంధ్రాలోని పశ్చిమగోదావరికి ఇప్పుడీ యాత్ర చేరింది. కృష్ణ, గోదావరి వరి జిల్లాల్లో వైసీపీకి 2014 ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాలేదు.. కానీ ఇప్పుడు జగన్ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. జగన్ పాదం పరిగెడుతుంటే జనం ఇసుకేస్తే రాలనంతమంది ఆయనతో పాదం కలుపుతున్నారు..
రాజకీయాల్లో బ్రహ్మాస్త్రంలాంటి పాదయాత్రను జగన్ ఎంచుకున్నారు. నిజానికి చంద్రబాబు... జగన్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డుతగిలారు. వైసీపీ నాయకులను ఆకర్షించారు. పాదయాత్రకు ఇబ్బందులు తెచ్చిపెట్టారు. కానీ జనం మాత్రం జగన్ ను అక్కున చేర్చుకున్నారు. పాదయాత్ర గురించే తెలుసు కనుకే ఇప్పుడు చంద్రబాబులో ఆందోళన మొదలైనట్టు తెలిసింది. పాదయాత్ర చేసిన ప్రతీ ఒక్కరు తరువాతి కాలంలో సీఎం అయ్యారు. నాడు వైఎస్, తర్వాత బాబు.. ఇప్పుడు జగన్ పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతోంది.. ఇదే చంద్రబాబులో ఆందోళన ప్రస్తుతం రేకెత్తిస్తోందట..