ఆ బాబా కి జైలు తప్పదా ?

Update: 2021-06-03 17:30 GMT
యోగా గురువు రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు స‌మ‌న్లు జారీచేసింది. త‌న ప‌తంజ‌లి సంస్థ ఉత్ప‌త్తి చేసిన క‌రోనిల్ మందు క‌రోనాను త‌గ్గిస్తుంద‌ని రాందేవ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని,  ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాన్ని ఆపాలంటూ ఢిల్లీ మెడిక‌ల్ అసోసియేష‌న్ కోర్టును ఆశ్ర‌యించింది.

క‌రోనా సంక్షోభంతో దేశం అల్లాడుతున్న వేళ రాందేవ్ త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్నార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు లాయ‌ర్ కోర్టుకు వివ‌రించారు. రాందేవ్ చేస్తున్న వ్యాఖ్య‌లు సైన్స్ తోపాటు, వైద్యుల ప్ర‌తిష్ట‌ను మంట‌గ‌లిపే విధంగా ఉన్నాయ‌ని అన్నారు.

కాగా.. అలోప‌తి వైద్యంపై రాందేవ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ గ‌తంలోనే ఐఎంఏ కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని కూడా ఢిల్లీ మెడిక‌ల్ అసోసియేష‌న్ త‌న‌ ఫిర్యాదులో పేర్కొంది. కొవిడ్ ప‌రిస్థితిని త‌నకు అనుకూలంగా  మార్చుకునేందుకు రాందేవ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, త‌న క‌రోనిల్ మందును ప్ర‌చారం చేసుకునేందుకు అల్లోప‌తిపై నిందలు వేస్తున్నార‌ని పేర్కొంది. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం.. రాందేవ్ కు స‌మ‌న్లు జారీచేసింది.

ఇటీవ‌ల అల్లోప‌తి వైద్యంపై రాందేవ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాకు అల్లోప‌తి వైద్యం ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ల‌క్ష‌లాది మంది చ‌నిపోతున్నార‌ని రాందేవ్‌ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

‘‘అల్లోప‌తి ఒక కుంటి శాస్త్రం. మొద‌ట హైడ్రాక్సీ క్లోరోక్విన్ విఫ‌ల‌మైంది. ఇప్పుడు రెమ్ డెసివ‌ర్ వంటివి కూడా ఫెయిల‌య్యాయి. యాంటీ బ‌యాటిక్స్ సైతం విఫ‌ల‌మ‌య్యాయి. ఆక్సీజ‌న్‌కొర‌త‌క‌న్నా.. ఈ మందుల వ‌ల్ల‌నే ల‌క్ష‌లాది మంది చ‌నిపోయారు’’అని ఆ వీడియోలో అన్నారు. దీంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ఐఎంఏ కోర్టుకెక్కింది.
Tags:    

Similar News