టార్చర్ ఎక్కువైంది.. లాంగ్ లీవ్ లపై వెళ్లిపోతున్న అధికారులు!

Update: 2022-11-30 23:30 GMT
ఓవైపు అధికార టీఆర్ఎస్ ఒత్తిడులు.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ హెచ్చరికలు.. అభివృద్ధి కోసం అధికారుల నిలదీతలు.. పనుల కోసం టార్చర్ లు.. ఇప్పుడు తెలంగాణలో అధికారులు నలిగిపోతున్నారు. గత ఏడాది ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ లో ఇప్పుడు అధికారులు టార్చర్ అనుభవిస్తున్నారు.

హుజూరాబాద్ లో బీజేపీ గెలిచాక అక్కడ అధికారులు చుక్కలు చూస్తున్నారట.. నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఓ విభాగం అధికారులు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు. ఒక పంచాయతీ కారణంగా తాము అన్యాయానికి గురవుతున్నామని మిగతా గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో ప్రధాన చర్చకు కేంద్రబిందువైంది. అక్కడ నెలకొన్న రాజకీయాల వైరాలు అధికారులపై పడుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ పడుతున్నాయి.

తాజాగా హుజూరాబాద్ మండలంలోని ఓ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు చేయవద్దంటూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు వచ్చాయి. అయితే బిల్లులు చేయాలని మరో పార్టీ ప్రజాప్రతినిధి ఇదే సమయంలో ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగి లీవ్ పెట్టాడు. తాజాగా సబ్ డివిజన్ స్థాయి అధికారి కూడా లాంగ్ లీవ్ పెట్టాడు.

అధికార, విపక్ష నాయకుల ఆధిపత్య పోరు కారణంగా ఇప్పుడు అధికార యాంత్రాంగం సెలవుపై వెళ్లే పరిస్థితి రావడం చర్చకు దారితీసింది. ఒత్తిడులు తట్టుకోలేక అధికారులు సెలవులు పెట్టి విధులకు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల వ్యవహరిస్తున్న తీరుతో తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని భయపడిపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News