హరీష్‌కు విష‌మ ప‌రీక్ష‌

Update: 2021-08-17 10:30 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడంద‌రి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక పైనే ఉంది. ఇంకా నోటిఫికేష‌న్ రాన‌ప్ప‌టికీ ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుంద‌నే స్ప‌ష్టత లేన‌ప్ప‌టికీ అధికార‌, ప్ర‌తి ప‌క్ష పార్టీల‌న్నీ ఈ ఎన్నిక‌లో విజ‌యమే ల‌క్ష్యంగా ఎప్ప‌టి నుంచో పావులు క‌దుపుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం అత్య‌వ‌స‌రం. అందుకే ఆ దిశ‌గా స‌ర్వ‌శ‌క్తులు ధార‌పోస్తోంది. ఒక‌వేళ ఓట‌మి ఎదురైతే మాత్రం ప్ర‌భుత్వం, పార్టీ ప‌రువు పోతుంది. ప్ర‌భుత్వంపై మ‌రింత వ్య‌తిరేక‌త పెరుగుతుంది. అదే గెలిస్తే మాత్రం ప్ర‌తిప‌క్షాల నోళ్లు మూత‌బ‌డ‌తాయి. మ‌ళ్లీ సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కూ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అందుకే ఈ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను సీఏం కేసీఆర్‌ ప్ర‌ధాన నాయ‌కుడు హ‌రీశ్ రావు భుజాల‌పై మోపారు.

పార్టీలో తిరుగుబావుటా ఎగ‌ర‌వేసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారిన ఈట‌ల రాజేంద‌ర్ ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించి త‌న సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ విజ‌యంతో కేసీఆర్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో ఉందో చాటిచెప్ప‌డంతో పాటు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డ‌మే ఈట‌ల ప్ర‌ధాన అజెండాగా క‌నిపిస్తోంది. కేసీఆర్ నియంతృత్వ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడే దిశ‌గా త‌న విజ‌య‌మే మొద‌టి మెట్టు అవుతుంద‌ని ఈట‌ల ధీమాగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్‌లో గెల‌వ‌డం కోసం కేసీఆర్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అన్ని ర‌కాల సామాజిక వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో చేయించిన స‌ర్వేల ద్వారా అధికార పార్టీ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూప‌ట్లేద‌ని తెలిసిన‌ట్లు స‌మాచారం. దీంతో అక్క‌డ పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావుకు అప్ప‌గించారు.

హుజూరాబాద్‌లో పార్టీని గెలిపించ‌డం హ‌రీశ్‌కు విష‌మ ప‌రీక్ష లాంటిదే. గ‌తంలో అనేక ప‌రిస్థితుల్లో పార్టీని క్లిష్ట ప‌రిస్థితుల్లో నుంచి గ‌ట్టెక్కించిన నైపుణ్యం ఆయ‌న‌కు ఉంది. కానీ ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వ‌ని దుబ్బాక ఉప ఎన్నిక‌లు చాటిచెప్పాయి. త‌న సొంత జిల్లాలోనే ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌రాజ‌యానికి హ‌రీశ్ బాధ్య‌త తీసుకున్నాడు. కానీ ఈ ఓట‌మితో అటు కేసీఆర్ ద‌గ్గ‌ర్‌.. ఇటు పార్టీలోనూ నెగెటివ్ మార్కులు ప‌డ్డాయి. కానీ గెలుపోట‌ములు సంబంధం లేకుండా పోరాటం చేసే నాయ‌కుడిగా హ‌రీశ్‌కు పేరుంది. అందుకే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో మ‌రోసారి ఆ బాధ్య‌త‌ను హ‌రీశ్‌కే అప్ప‌జెప్పారు. ఈటల రాజేంద‌ర్ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామంలో ఆయ‌న‌కు అనుచ‌ర వ‌ర్గం ఉంది. మ‌రోవైపు ప్ర‌జ‌ల్లోనూ ఆయన‌పై సానుభూతి క‌నిపిస్తోంది. ఇలాంటి క‌ఠిన స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు హ‌రీశ్ అయితేనే స‌రైనోడ‌ని కేసీఆర్ న‌మ్మారు. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంలో అనుభ‌వం క‌లిగిన ఆయ‌న.. వ్యూహాలు ర‌చించి పార్టీని గెలిపించాల్సిన అవ‌స‌రం ఉంది. అభ్య‌ర్థి విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఆయ‌న బ‌రిలో నిలిచిన‌ట్లు చెప్పుకోవాలి. మ‌రి ఈ ప‌రీక్ష‌లో ఆయ‌న పాస్ అవుతారా? లేదా? అన్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తేలుతుంది.




Tags:    

Similar News