డైలీ కేసీఆర్ ప్రెస్ మీట్.. హుజూరాబాద్ ఓటర్లకు మొక్కాల్సిందే

Update: 2021-11-09 04:58 GMT
ఎవరేం చెప్పినా తాను అనుకున్నది మాత్రమే చేసే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లో భారీ మార్పును తీసుకొచ్చిన క్రెడిట్ హుజూరాబాద్ ఓటర్లదేనని చెప్పాలి. అరచేతి లో ఉన్న అధికారం తో నేల మీద నడవరన్న మాట వినిపించే కేసీఆర్.. ఎప్పుడు ఆకాశంలోనే విహరిస్తారని.. మంత్రులకు సైతం అందని కేసీఆర్ ఇప్పుడు ప్రజల ముందుకు రోజూ రావటం అంటే మాటలా? దేశం లోని మరే ముఖ్య మంత్రి వ్యవహరించని రీతి లో.. ప్రగతి భవన్ కంటే ఫాంహౌస్ లో ఎక్కువ గా ఉండే కేసీఆర్.. ఇప్పుడు రోజు వారీ ప్రెస్ మీట్ పెట్టటం హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ చెప్పే మాటలకు.. చేతల కు ఏ మాత్రం సంబంధం ఉండదన్నట్లుగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఆయన రోజు వారీ ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించిన వేళ.. మీడియా లో ఎవరూ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఆయన మాటలు అలానే ఉంటాయని భావించారు. కానీ.. ఆయన మాత్రం తాను చెప్పిన మాటకు తగ్గట్లే రెండో రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టటం.. సుదీర్ఘంగా మాట్లాడటం తెలిసిందే. గులాబీ బాస్ లో ఇంతటి మార్పునకు కారణం హుజూరాబాద్ ఓటర్లు మాత్రమేనని చెప్పాలి. ఎవరూ కేసీఆర్ ను ప్రభావితం చేయలేరన్న మాట లో తప్పు ఉందని.. ఆయన్ను మొత్తంగా మార్చే శక్తి ప్రజల్లో ఉందన్న విషయం తాజాగా ఆయన పెడుతున్న ప్రెస్ మీట్లు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

కరోనా వేళ లోనూ ప్రతి రెండు.. మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెడతానని.. అన్ని విషయాల్ని తానే ప్రజలకు నేరుగా వెల్లడిస్తానని చెప్పటం.. అందుకు తగ్గట్లే నాలుగైదు వరుస ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన.. తర్వాతి కాలం లో పత్తా లేకుండా పోవటం తెలిసిందే. కరోనా మొదటి వేవ్ సందర్భం గా కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుంటే.. ఒక కొత్త సినిమాను టీవీ లో టెలికాస్ట్ చేసే వేళ లోనో.. ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాంకు ఉండే టీఆర్పీ రేట్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కేసీఆర్ ప్రెస్ మీట్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉన్న వారంతా ఆయన ఏం చెబుతారా? అన్న ఆసక్తి తో పనులన్ని మానుకొని మరీ ఫాలో అయ్యే పరిస్థితి.

అయితే.. ఆయన తన ప్రెస్ మీట్ల ను అర్థాంతరంగా ఆపేయటం తెలిసిందే. ఆ తర్వాత ఎప్పుడో కానీ మీడియా ముందుకు వస్తూ.. తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేవారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన నాలుగు రోజుల వరకు మౌనంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టటమే కాదు.. తన పై నిందాపూర్వకంగా ఆరోపణలు చేసే వారి సంగతి చూసేందుకు వీలుగా తానే డైలీ బేసిస్ లో ప్రెస్ మీట్లు పెడతానని చెప్పి.. రెండో రోజూ తాను చెప్పిన మాటను ఫాలో అయ్యారు. ఏమైనా.. అంతులేని ధీమాను ప్రదర్శించే కేసీఆర్.. అందుకు భిన్నంగా డైలీ ప్రెస్ మీట్ పెట్టేలా చేయటం లో హుజూరాబాద్ ఓటర్లే కీలక మని చెప్పాలి. గతం లో ఎప్పుడూ చూడని రీతి లో ఉరుకులు పరుగులు పెట్టేలా చేసిన వారికి తెలంగాణ సమాజం రుణ పడి ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News