హుజూర్ నగర్ బరి త్రిముఖం..సత్తా ఎవరిదో తేలేది ఇక్కడే

Update: 2019-09-20 04:23 GMT
టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా కొనసాగుతున్న తన స్థానం హుజూర్ నగర్ కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నిక ఖాయమే. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో జెండా పాతేందుకు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ ఉవ్విళ్లూరుతోంది. అయితే పార్టీ ఫిరాయింపులతో విపక్షాలన్నింటినీ దాదాపుగా కుదిపేస్తున్న టీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు హస్తం పార్టీ కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నికనే వేదికగా చేసుకుంటోంది. అయితే ఈ రెండు పార్టీలకు కూడా షాకిచ్చేలా తనదైన వ్యూహంతో బరిలోకి దిగుతోంది. బైపోల్స్ లో బీజేపీ ఎంట్రీలో హుజూర్ నగర్ లో త్రిముఖ పోటీ తప్పదు. మరి బీజేపీ బరిలోకి దిగితే... ఇటు టీఆర్ ఎస్ తో పాటు అటు హస్తం పార్టీ సత్తా కూడా ఏమిటో పక్కాగానే తేలిపోతుందన్న మాట.

కేంద్రంలో వరుసగా రెండో పర్యాయం అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ... తనకు కొరుకుడుపడని పార్టీల అంతు చూసేందుకు కాస్తంత దూకుడుగానే ముందుకు సాగడంతో పాటుగా తనకు అధికారం దక్కని రాష్ట్రాలు - ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలపై కాస్తంత ప్రత్యేక ప్రణాళికలే రచిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఊహించని విధంగా నాలుగు సీట్లను కైవసం చేసుకోవడంతో పాటుగా కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్ లో ఓడించి సత్తా చాటింది. ఈ ఫలితాలపై విశ్లేషించుకున్న బీజేపీ కాస్తంత కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న భావనకు వచ్చింది. ఈ భావనతోనే తెలంగాణలో బీజేపీ తనదైన వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పుడు హుజూర్ నగర్ బరిలోకి దిగిపోతోంది.

హుజూర్ నగర్ లో ప్రస్తుతం బీజేపీకి అంతగా బలం లేదనే చెప్పాలి. అయితే ఇటీవల రాష్ట్రంలోని పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి క్యూ కడుతున్నారు. వెరసి తెలంగాణ బీజేపీ శాఖలో నేతల సంఖ్య అనూహ్యంగానే పెరుగుతోంది. అదే సమయంలో కేడర్ కూడా భారీగానే పెరుగుతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పెరిగిన నేతల సంఖ్య - కేడర్ బలంతో హుజూర్ నగర్ లో బీజేపీ.... అటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీఆర్ ఎస్ కు షాకిచ్చి సీటును ఎగురవేసుకునిపోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన వినిపిస్తోంది. అలా కాకుండా హుజూర్ నగర్ బరిలో గెలవకున్నా... తన ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నా కూడా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లకు బీజేపీ డేంజర్ సిగ్నల్స్ పంపినట్టేనన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా బీజేపీ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో... హుజూర్ నగర్ లోనే టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీల సత్తా ఏమిటో తేలిపోతుందన్న వాదన అయితే బలంగానే వినిపిస్తోంది.


Tags:    

Similar News