ప్రపంచ కుబేరుల్లో హైదరాబాదీయుల హవా

Update: 2021-03-03 04:30 GMT
కరోనా కష్ట కాలం కోట్లాది మందిని వేధిస్తే.. కొందరికి మాత్రం కాసుల వర్షం కురింపించింది. సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకోవటమే దీనికి కారణంగా చెప్పాలి. తాజాగా వంద కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగిన బిలియనీర్ల జాబితాను విడుదల చేశారు. ఇందులో హైదరాబాద్ మహా నగరానికి చెందిన పది మంది ఉండగా.. వీరిలో ఏడుగురు ఫార్మా రంగానికి చెందిన వారే కావటం గమనార్హం. మిగిలిన ముగ్గురు నిర్మాణ.. మౌలిక సదుపాయాల సంస్థల అధినేతలు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ పది మంది ఆస్తి విలువ ఏకంగా రూ.1.66 లక్షల కోట్లు. అంటే.. ఇంచుమించు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు సమానమన్నమాట.

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021కు సంబంధించిన జాబితాను తాజాగా విడుదల చేసింది. అందులో ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన ఆస్తి రూ.6.05లక్షల కోట్లుగా లెక్క వేశారు. అంతర్జాతీయంగా ఎనిమిదో స్థానానికి అంబానీ చేరితే.. ఇటీవల కాలంలో వేగంగా దూసుకెళుతున్న గౌతమ్ అదానీ సంపద కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన 48వ స్థానానికి చేరుకున్నారు. దేశంలో రెండో అత్యంత సంపన్నుడిగా ఆయన నిలిచారు.

వంద కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగిన సంపన్నుల జాబితాలో ఈసారి అత్యధికంగా దేశం నుంచి 177 మందిని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 414 మంది కొత్తగా చేరారు. దీంతో.. మొత్తం బిలియనీర్ల సంఖ్య 3228కు చేరింది. వీరిలో అత్యధికం చైనాకు చెందిన వారున్నారు. 1058 మంది చైనీయులు ఉంటే.. 696 మంది పారిశ్రామికవేత్తలతోఅమెరికా రెండో స్థానంలో నిలిచింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 19700 కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. అమెజాన్ కు చెందినజెఫ్ బోసెస్ 18900 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిస్తే.. ఎల్ వీ ఎమ్ హెచ్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 11400 కోట్ల డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. రానున్నరోజుల్లో చైనా.. అమెరికా తర్వాత అత్యధిక బిలియనీర్ల జాబితాలో భారతీయులు ఉండే అవకాశం ఉందంటున్నారు.

మొత్తం బిలియనీర్లలో హైదరాబాద్ కు చెందిన 10 మంది బిలియనీర్లు చోటు సంపాదించారు. వారెవరంటే..

పేరు                                            కంపెనీ                             నికరసంపద (కోట్లల్లో)
మురళీ దివి ఫ్యామిలీ                      దివీస్                                  54,100
పివీ రామ్ ప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ          అరబిందో ఫార్మా                   22,600
బి.పార్థసారథి రెడ్డి, కుటుంబం            హెటిరో డ్రగ్స్                      16,000
కె.సతీశ్ రెడ్డి, కుటుంబం                   డాక్టర్ రెడ్డీస్                         12,800
జీవీ ప్రసాద్, జి. అనురాధ                  డాక్టర్ రెడ్డీస్                        10,700
పి. పిచ్చిరెడ్డి                                    మేఘా ఇంజనీరింగ్               10,600
జూపల్లి రామేశ్వరరావు, కుటుంబం      మైహోమ్ ఇండస్ట్రీస్              10,500
పీవీ క్రిష్ణారెడ్డి                                      మేఘా ఇంజనీరింగ్               10,200
ఎం. సత్యనారాయణ రెడ్డి, కుటుంబం    ఎమ్ఎస్ఎన్ ల్యాబ్స్          9,800
వీసీ నన్నపనేని                                   నాట్కో ఫార్మా                     8,600
Tags:    

Similar News