మోడీకి హైదరాబాదీ సవాల్..

Update: 2016-12-02 08:09 GMT
ప్రధాని మోడీకి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి  ఊహించని పరీక్ష పెట్టాడు. ప్రధాని మోడీ అయినా మారువేషంలో బయటకొస్తే రూ.2 వేల నోటుకు చిల్లర సంపాదించలేరని.. అలా తెస్తే మోడీ మొనగాడేనని అన్నారు. కొత్త నోటు రెండు వేల రూపాయలకు చిల్లర దొరకడం లేదని, బ్యాంకుల్లో సరిపడా నగదు ఇవ్వట్లేదంటూ హైదరాబాద్ లోని ఒక బ్యాంకులో ఒక ఖాతాదారుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక న్యూస్ ఛానెల్ తో సదరు ఖాతాదారుడు మాట్లాడుతూ, మోదీ ప్రధాని హోదా లో మారువేషంలో ఒక సామాన్యుడిగా హోటల్ కు వెళ్లి ఇడ్లీ తిని - చాయ్ తాగిన తర్వాత, బిల్లు చెల్లించేందుకు రెండు వేల రూపాయల నోటు ఇస్తే..చిల్లర ఇస్తారో లేదో చెప్పాలంటూ నిలదీశాడు.

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే, ఇప్పుడు మోదీ కూడా బయటకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని కోరారు. బ్యాంక్ క్యూలో ఉదయం నుంచి కొన్ని గంటలపాటు నిలబడితే తనకు ఐదువేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, మరికొంత మంది ఖాతాదారులకు ఆమాత్రం కూడా దక్కలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

నిజానికి రూ.2 వేల నోటు తరువాత చిన్న నోటు రూ.100 తప్ప మధ్యలో ఏమీ లేకపోవడంతో చిల్లర సమస్య తీరడం లేదు. దుకాణాదారులు, వ్యాపారులు రూ.500 కంటే తక్కువ గిరాకీ అయితే దాన్ని వదులుకుంటున్నారు కానీ చిల్లర ఇవ్వడం లేదు.  ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి రూ.2 వేలు చిల్లర తేవడం మోడీకి కూడా అసాధ్యమని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News