హమ్మయ్య... మెట్రో రైలు వచ్చేస్తోంది

Update: 2016-11-08 11:09 GMT
 ఢిల్లీలో మెట్రో.. కలకత్తాలో మెట్రో.. చెన్నైలో మెట్రో.. ఇలా ప్రధాన నగరాలన్నీ మెట్రో రైలు సౌకర్యంతో ట్రాఫిక్ బాధలు కొంతలో కొంత తప్పించుకుంటుంటే హైదరాబాదీ ప్రజలు మాత్రం మెట్రోరైలు ప్రాజెక్టు కారణంగా మూణ్నాలుగేళ్లుగా తీవ్ర ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్నారు. సరే.. ఇప్పుడు కష్టపడినా మెట్రో పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి కదా అని సరిపెట్టుకుంటున్నా ఆ ప్రాజెక్టు మాత్రం అంతకంతకూ లేటవుతూ వారి సహనాన్ని పరీక్షించింది. అయితే... హైదరాబాద్ నగరవాసుల కష్టాలకు త్వరలో తెరపడనుంది. ఉగాది నాటికి ఒక లైనులో మెట్రో సేవలు మొదలు పెడతామని ప్రకటించడంతో వారంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.

హైద‌రాబాదీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న క‌ల‌ల బండి మెట్రోరైల్ ప‌ట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. వ‌చ్చే ఉగాది నుంచి మెట్రోరైలును న‌డిపిస్తామ‌ని మెట్రోరైల్ ఎండీ ఎన్‌ వీఎస్ రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఒక వేళ‌ ఆ రోజు వీలుకాక‌పోతే రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం(జూన్ 2) నాడు ప్రారంభించ‌నున్నట్లు వెల్లడించారు.

ముందుగా ఇది నాగోల్‌-మెట్టుగూడ‌ - మియాపూర్-ఎస్సార్ న‌గ‌ర్ మార్గాల్లో ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. మెట్రోప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయ‌ని, పాతబ‌స్తీ మిన‌హా ఎక్కడా స‌మ‌స్యలేదని ఆయ‌న పేర్కొన్నారు. కాగా ఉప్పల్ మార్గంలో ఇప్పటికే చాలాకాలంగా ట్రయల్ రన్ నిర్వహిస్తుండడంతో ఎండీ చెప్పినట్లు ఉగాదికి ప్రారంభం కావచ్చన్న ఆశలు బలపడుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News