సిటీలోకి 32 వేల వాహనాలు వచ్చేశాయ్

Update: 2016-01-18 04:30 GMT
పండగ సెలవలు అయిపోయాయి. పండక్కి ఊళ్లకి వళ్లినోళ్లంతా మళ్లీ సిటీకి వచ్చేయటం మొదలైంది. నాలుగు రోజులుగా వరుస సెలవులతో సేదతీరిన నగరజీవులు తమ యాంత్రిక జీవనాన్ని షురూ చేసేందుకు ఆదివారం నుంచే తిరిగి రావటం మొదలెట్టారు. నాలుగు రోజులుగా ఇళ్లల్లో లేని వారు.. ఆదివారానికి నగరానికి చేరుకొని.. సర్దుబాట్లు చేసుకొని సోమవారం ఉదయం స్కూళ్లు.. ఆఫీసులకు వెళ్లేలా నగరానికి తిరిగి వచ్చేశారు.

దీంతో.. రైళ్లు.. బస్సులు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేసినా రద్దీ కారణంగా సీట్లు దొరకని పరిస్థితి.ఇదిలా ఉంటే.. ప్రైవేటు వాహనాల్లో నగరానికి వచ్చే వారి సంఖ్య భారీ ఎత్తున ఉంది. సాధారణంగా విజయవాడ.. హైదరాబాద్ మధ్య నిత్యం 17 వేల వరకు వాహనాలు రాకపోకలు జరుపుతుంటే.. ఆదివారం ఒక్కరోజు రాత్రి 9 గంటల సమయానికి దాదాపు 32 వేలకు పైగా వాహనాలు బెజవాడ నుంచి హైదరాబాద్ వైపు రావటం గమనార్హం.

ఇంత పెద్ద ఎత్తున వాహనాలు నగరానికి వచ్చేస్తుండటంతోజాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. టోల్ ప్లాజా దగ్గర గంటల కొద్దీ వెయిటింగ్ తో విసిగెత్తిపోయే పరిస్థితి. 20 సెకండ్లకు ఒక వాహనానికి క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రద్దీ బెజవాడ.. హైదరాబాద్ రూట్లోనే కాదు.. మహబూబ్ నగర్ .. హైదరాబాద్ వైపు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. హైదరాబాద్ కు అన్ని వైపుల ఉన్న టోల్ ప్లాజాలు వాహనాల రద్దీతో కిటకిటలాడిన పరిస్థితి. మొత్తంగా పండక్కి ఊళ్లకు వెళ్లినోళ్లలో చాలామంది ఆదివారం రాత్రికే నగరానికి చేరుకున్న పరిస్థితి. సోమవారం ఉదయం నుంచి నగర రోడ్లు యధావిధిగా కిటకిటలాడటం ఖాయమన్నమాట.
Tags:    

Similar News