హాస్టల్ విద్యార్థులందరికీ లాక్ డౌన్ పాస్‌ లు

Update: 2020-03-25 13:50 GMT
దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌ డౌన్ కారణంగా అనేకమంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లలేక... తాము ఉన్న చోటనే మరో మూడు వారాల పాటు ఉండలేక సందిగ్ధావస్థలో పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు చాలామంది హాస్టళ్లలో ఉంటారు. వారంతా హాస్టళ్లలో ఉండలేక.. ఇళ్లకు వెళ్దామంటే పోలీసులు వెళ్లనివ్వక ఇబ్బందులుపడుతున్నారు. ముఖ్యంగా అమీర్ పేట్ - పంజాగుట్ట - ఎస్ ఆర్ నగర్ ప్రాంతాల్లో హాస్టల్లు ఎక్కువ. వారంతా ఎస్ ఆర్ నగర్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడంతో పోలీసులు స్పందించారు.

హాస్టళ్ల విద్యార్థులు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో చెక్‌ పోస్ట్‌ ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, ఎస్ ఆర్‌ నగర్‌ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్‌ ఓనర్‌ నుంచి లెటర్‌ తీసుకురావాలని - వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు.

మరోవైపు తెలంగాణ - ఏపీ సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు నిలిచిపోయారు. రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలున్నారు. అందులో విద్యార్థులే కాదు పిల్లాపాపలతో కుటుంబాలూ అక్కడ వేచి చూస్తున్నాయి. తమ అవసరాల రీత్యా తమను అవతలివైపు పంపించాలని పోలీసులను కోరుతుండడం కనిపిస్తోంది.
Tags:    

Similar News