హైదరాబాద్ లో రాత్రి 12 దాటితే పబ్స్ క్లోజ్

Update: 2016-05-09 05:28 GMT
రూల్ బుక్స్ లో రూల్స్ చాలా కఠినంగా కనిపిస్తుంటాయి. మరి.. రూల్ బుక్ లో ఉన్న నిబంధనల అమలు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం తాజాగా నగరానికి చెందిన బీటెక్ విద్యార్థిని దేవి మృతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రాత్రి ఒంటిగంట తరువాత పబ్ లు మూసివేయాలని రూల్స్ చెబుతున్నా.. తెల్లవారుజామున మూడు గంటల వరకూ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల మరణించిన దేవి యాక్సిడెంట్ కేసులో ఆమె.. తన స్నేహితులతో వెళ్లిన బీట్స్ పర్ మినిట్ పబ్ అర్థరాత్రి 2.30 గంటల  వరకూ నడిచిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పబ్ లను అర్థరాత్రి 12 గంటలకే మూసివేయాలన్న నిర్ణయాన్ని నగర పోలీసులు తీసుకున్నారు. ఒకవేళ ఈ రూల్ ని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని అన్ని పబ్ లు అర్థరాత్రి 12 గంటల సమయానికి మ్యూజిక్ క్లోజ్ చేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటి గంటలోపలే పబ్ ని బంద్ చేయాలని.. లేనిపక్షంలో.. రాత్రి ఒంటిగంట తర్వాత నడిచే పబ్ లను వీడియో తీసేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. దేవి మృతి సందర్భంగా వచ్చిన విమర్శల నేపథ్యంలో పోలీసులు ఇంత గట్టిగా రూల్స్ ను చెబుతున్నా.. ఆచరణలో వారెంత గట్టిగా వ్యవహరిస్తారో మరి..?
Tags:    

Similar News