ష‌ర్మిల కేసులో మ‌రింత లోతు విచార‌ణ‌!

Update: 2019-01-25 06:13 GMT
రాజ‌కీయంగా స‌వాల‌చ్చ ఉండొచ్చు. కానీ.. వాటికి కొన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు ఉంటాయి. అలాంటి వాటిని ప‌ట్టించుకోకుండా ఉన్మాద‌పూరితంగా ఒక మ‌హిళ‌ను ఉద్దేశించి అస‌త్య ప్ర‌చారం చేయ‌టం ఏ మాత్రం స‌మంజ‌సం కాదు. నోరు ఉంది క‌దా అని.. భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తామంటే చ‌ట్టం ఒప్పుకోదు.  ఒళ్లు మ‌రిచి.. కేవ‌లం క్ష‌క్ష‌పూరితంగా వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వారు త‌గిన మూల్యం చెల్లించాల్సిందే.

ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో సాగిస్తున్న ప్ర‌చారంపై ఆమె నొచ్చుకోవ‌టం.. హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టం తెలిసిందే. సోష‌ల్ మీడియాలోనూ.. వెబ్ సైట్లు.. వెబ్ ఛాన‌ళ్ల‌తో సాగిస్తున్న దుష్ప్ర‌చారంపై పోలీసులు న‌జ‌ర్ వేశారు. ఇప్ప‌టికే ఐదుగురికి నోటీసులు పంపిన పోలీసులు తాజాగా మ‌రో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు.

ఈ కేసుపై ప్ర‌త్యేక దృష్టి సారించిన పోలీసులు సోష‌ల్ మీడియా జ‌రిగిన ప్ర‌చారం.. వాటికి స్పందించిన వారిపైనా ఆరా తీయ‌టం షురూ చేశారు. ఈ పాడు ప్ర‌చారానికి బాధ్యులైన వారిని గుర్తించే ప‌నిలో ఉన్న పోలీసులు.. సాంకేతిక అంశాల్ని ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపు 60 యూట్యూబ్ లింకుల గురించి ష‌ర్మిల త‌న ఫిర్యాదులో ప్ర‌స్తావించారు.

ఈ ఫిర్యాదులో పేర్కొన్న స‌మాచారంతో విచార‌ణ షురూ చేసిన పోలీసులు.. స‌ద‌రు యూట్యూబ్ చాన‌ళ్ల య‌జ‌మానుల్ని గుర్తించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇప్ప‌టికే కొంద‌రిని గుర్తించి వారిని విచార‌ణ‌కు పిలుస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 15 మందిని విచారించారు. అభ్యంత‌ర‌క‌రంగా ఉండే కామెంట్ల‌ను షేర్ చేసిన వారిని.. పోస్ట్ చేసిన వారిని గుర్తించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కీల‌క‌భూమిక ఎవ‌రిద‌న్న అంశాన్ని గుర్తించేందుకు వీలుగా కేసు లోతుల్లోకి విచార‌ణ అధికారులు వెళుతున్నారు. నిందితుల్ని గుర్తించేందుకు గూగుల్.. యూట్యూబ్ యాజ‌మాన్యాల్ని స‌మాచారం కోసం పోలీసులు ఇప్ప‌టికే అభ్య‌ర్థించారు. మొత్తానికి చేసిన పాడు ప‌నికి ఫ‌లితం అనుభ‌వించేలా చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News