గంగిరెద్దుల ఆట‌ల‌పై పోలీస్ క‌న్నెర్ర‌...

Update: 2018-01-03 10:15 GMT
హైద‌రాబాద్ న‌గ‌రంలో బిచ్చ‌గాళ్ల ఏరివేత అంశం మ‌రో మ‌లుపు తిరిగింది. న‌గ‌రంలో యాచకుల‌ను త‌ర‌లించ‌డంలో భాగంగా గంగిరెద్దులను ఆడిస్తే యాచకులుగా గుర్తించి అరెస్టు చేసి - జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో గంగిరెద్దులను ఆడించే వారిపై పోలీసుల వేధింపులు అరికట్టాలని ఆ వ‌ర్గానికి చెందిన వారు ఆందోళ‌న చేప‌ట్టారు. మంగళవారం హైదరాబాదులోని గొల్కొండ చౌరస్తాలో సుమారు 100కి మందికి పైగా గంగిరెద్దుల కులస్తులు ఎద్దులతో కలిసి నిరసన ప్రదర్శన జరిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన గంగిరెద్దుల కులస్తులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు - 3ఎకరాల భూమి - ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీరికి టీమాస్‌ - ఎంబీసీ సంఘాలు సంఘీభావం తెలిపాయి.

ఈ సందర్భంగా టీమాస్‌ - ఎంబీసీ సంఘాల నేతలు ఎం.శ్రీనివాస్‌ - గుమ్మడిరాజు నరేష్‌ మాట్లాడుతూ.. నగరంలో గంగిరెద్దులను ఆడించేవారు వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారని తెలిపారు. వీరిని బిక్షగాళ్లుగా పరిగణించి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. వీరికి వృత్తి తప్ప వేరే ప్రత్యామ్నాయ పనులు లేవని - అటువంటి వారిని అడ్డుకుంటే ఏవిధంగా జీవిస్తారని ప్రశ్నించారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గంగిరెద్దుల కులస్థులు తమ ఆటపాటతో ప్రజల్లో చైతన్యం నింపారని చెబుతూ అలాంటిది ప్రత్యేక రాష్ట్రంలో వారికి లభించే గుర్తింపు అరెస్టులా? అని గుమ్మడి రాజు నరేశ్‌ ప్రశ్నించారు.

అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వచ్చిన సందర్భంలో గంగిరెద్దులను ఆడించకుండా అడ్డుకున్నారని, ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇల్లిల్లూ తిరిగే వారిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.. గంగిరెద్దుల సంఘం నాయకులు కోటయ్య - అశోక్‌ - సమ్మయ్య - ఎల్లయ్య మాట్లాడుతూ వృత్తినే నమ్ముకున్న గంగిరెద్దుల వాళ్లకు ఊళ్లలో సరైన భుక్తి దొర‌క‌డం లేద‌ని అందుకే రాజ‌ధానికి వ‌ల‌స వ‌స్తే...ఇలా అరెస్టులు చేయ‌డం అన్యాయ‌మ‌న్నారు. సంక్రాంతి పండ‌గ వ‌స్తున్న నేప‌థ్యంలో నగర వీధులు - కూడళ్లలో ప్రదర్శనలు ఇస్తూ పదో పరక కోసం ప్ర‌య‌త్నిస్తుంటే...ఇలా హెచ్చ‌రించ‌డం స‌రికాద‌ని వాపోయారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి, చిల్‌పచెడ్‌ మండలాల పరిధిలోని గంగిరెద్దుల గూడెనికి చెందిన దాదాపు యాభై మంది గంగిరెద్దులతో హైదరాబాద్‌ కు వచ్చార‌ని...వీరిలో కొంద‌రిని దిల్‌ సుఖ్‌ న‌గ‌ర్ వ‌ద్ద అరెస్టు చేశార‌ని అన్నారు. వారిని విడుద‌ల చేయాల‌ని కోరారు.
Tags:    

Similar News