హైద‌రాబాదీలు ధైర్య‌వంతులే.. టాప్ 3లో స్థానం!

Update: 2020-05-31 17:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ నివార‌ణ‌కు విధించిన లాక్‌ డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎలా ఉంటున్నారు? భవిష్యత్‌ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? భ‌యంగా.. ధైర్యంగా ఉన్నారా? అని త‌దిత‌ర విష‌యాల‌పై ఓ సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో తెలంగాణ ప్ర‌జ‌లు ధైర్య‌వంతులేన‌ని చాటారు. ముఖ్యంగా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ధైర్య‌వంతులు - భ‌యంబెరుకు లేని వార‌ని తేలింది. లాక్‌ డౌన్ 1 నుంచి మూడో ద‌శ వరకు ఆయా సందర్భాల్లో ప్ర‌జ‌లు ఏ విధంగా ఉన్నారోన‌ని మెంటల్‌ వెల్‌ బీయింగ్‌ ఇండెక్స్‌ (ఎండబ్ల్యూబీఐ)లో అధ్య‌యనం చేసింది. వివిధ రూపాల్లో ఎదురయ్యే భయాలను ఒక్కొక్కరు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై మానసిక ఆరోగ్యం అంచనా వేస్తున్నారు. భావోద్వేగం - ప్రవర్తన తీరు - ఆలోచనలు - జీవిత పరమార్థంపై అవగాహన వంటివి ఆధారం గా దీన్ని నిర్ధారిస్తారు. ఈ స‌ర్వేలో దేశ రాజ‌ధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలవగా - రెండో స్థానంలో గువాహటి - మూడో స్థానంలో మ‌న హైదరాబాద్‌ నిలిచింది.

వీరు చేసిన స‌ర్వే ప్రకారం.. హైదరాబాద్‌ నగరం ఒక్కటే గుడ్‌ కేటగిరీ నుంచి 18 శాతం పాయింట్లు పెంచుకుని ఎక్స్‌లెంట్‌ మెంటల్‌ వెల్ ‌బీయింగ్‌ కేటగిరీకి చేరుకున్నట్టు స్పష్టమైంది. కొన్ని నగరాల్లోని ప్రజల మానసిక ఆరోగ్యం తగ్గినట్టుగా ఈ పరిశీలనలో వెల్లడైంది. అయితే కొన్నింటిలో మెరుగైనట్లుగా తేలింది.

వైర‌స్ కారణంగా భవిష్యత్‌ లో తీవ్రమైన సంక్షోభం ఎదురుకావొచ్చుననే భయాలు - అపోహలు ఏర్పడ్డాయి. ఈ క్ర‌మంలోనే  ప్రజలు సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తారు? వీటి వల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుందని అంచనా వేసేందుకు టీఆర్‌ ఏ అనే కన్జ్యుమర్‌ ఇన్‌సైట్స్‌ అండ్‌ బ్రాండ్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ స‌ర్వే చేసింది. మొదటి లాక్‌ డౌన్‌ కాలానికి సంబంధించి టీఆర్‌ ఏ కరోనా వైరస్‌ కన్జుమర్‌ ఇన్‌సైట్స్ 1 ఏప్రిల్ 24వ తేదీన ఒక నివేదిక విడుద‌ల చేసింది. దానిలో పరిశీలించిన వివిధ అంశాలకు సంబంధించిన అధ్యయనాన్ని లాక్‌ డౌన్‌ 3.0 పేరిట ఇటీవ‌ల‌ ప్రకటించారు. లాక్‌ డౌన్ 1 నుంచి లాక్‌ డౌన్ 3కు వచ్చేటప్పటికీ నాగపూర్‌ 36%తో - కొచ్చి 37%, కోయంబత్తూరు 39%తో ‘వెరీ పూర్‌’ మెంటల్‌ వెల్‌బీయింగ్‌ కేటగిరీలో చేరాయని ఆ సంస్థ సీఈఓ చంద్రమౌళి వెల్ల‌డించారు. అహ్మదాబాద్ - కోల్‌ కతా - ముంబై - చెన్నై నగర ప్రజలు కూడా వివిధ అంశాల్లో మెరుగైన తీరును కనబరచలేకపోయారని - వారంతా ఆందోళ‌న‌లోనే ఉన్నార‌ని ఈ స‌ర్వే తెలిపింది.


Tags:    

Similar News