క‌త్తితో ఫోటో పెట్టారు.. జైల్లో వేశారు

Update: 2018-01-27 04:32 GMT
సోష‌ల్ మీడియా పిచ్చ పీక్స్ కు వెళుతోంది. సోష‌ల్ ప్ర‌పంచంలో న‌లుగురి కంటే భిన్నంగా క‌నిపించాల‌న్న ఆశ‌తో పాటు.. త‌మ‌దైన క్రేజ్ ను సృష్టించ‌టం కోసం ర‌క‌ర‌కాలుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వారు.. ఇప్పుడు వినూత్నంగా ఆలోచించ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రికొంద‌రు చ‌ట్టం ప‌రిధులు.. ప‌రిమితుల గురించి అవ‌గాహ‌న లేకుండా అడ్డంగా బుక్ అయిపోతున్నారు. క‌త్తులు.. త‌ల్వార్ల‌తో ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ముగ్గురు యువ‌కుల్ని హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు.

బ‌జార్లో దొరికే క‌త్తి కొన‌టం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం మ‌రో ఎత్తు. చ‌ట్ట ప్ర‌కారం ఆయుధాల్ని క‌లిగి ఉండ‌టం నేరం. అలాంటిది మార‌ణాయుధాల్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఫోటోలు దిగి.. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం పెద్ద నేరం. ఈ నేరానికి పాల్ప‌డిన హైద‌రాబాద్ కు చెందిన ముగ్గురు యువ‌కుల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

స‌న‌త్ న‌గ‌ర్‌ కు చెందిన రాహుల్‌.. న్యూబోయిన్ ప‌ల్లికి చెందిన సాయి.. అల్వాల్‌ కు చెందిన అర్జున్ దాస్ ల్ని తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురి వ‌య‌సు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర పాతికేళ్లు కావ‌టం గ‌మ‌నార్హం. వీరిలో ఒక‌రు స్నాప్ డీల్ ద్వారా త‌ల్వాన్ ను ఆర్డ‌ర్ చేసి తెప్పించుకోగా.. మ‌రొక‌రు బ‌య‌ట త‌ల్వార్‌ ను కొనుగోలు చేశారు. తాము కొనుగోలు చేసిన త‌ల్వార్ల‌తో ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో.. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయుధాల్ని క‌లిగి ఉండ‌టం.. వాటిని ప్ర‌ద‌ర్శిస్తూ ఫోటోలు దిగ‌టం నేర‌మ‌ని.. సోష‌ల్ మీడియా క్రేజ్ లో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఫోటోలు పోస్ట్ చేస్తే.. చిక్కులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. క‌త్తులు.. త‌ల్వార్లు.. డాగ‌ర్లు లాంటి ప‌దునైన లోహ ఆయుధాల్ని కొనుగోలు చేయ‌టం చ‌ట్ట‌ప్ర‌కారం నేరమ‌ని పోలీసులు చెబుతున్నారు. ప‌దునైన ఆయుధాల ఆర్డ‌ర్ల‌ను స్నాప్ డీల్‌.. అమెజాన్ లాంటి సంస్థ‌లు ఆర్డ‌ర్లు తీసుకోకూడ‌ద‌ని.. ఆ విష‌యాన్ని వారి దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. సో.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం మీ ఇష్టం. కానీ.. అవ‌న్నీ చ‌ట్టానికి లోబ‌డి మాత్రమే ఉండాల‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. లేని ప‌క్షంలో కొత్త తిప్ప‌లు త‌ప్ప‌వంతే.
Tags:    

Similar News