ఔను నేను ఉగ్ర‌వాదినే... అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌నం

Update: 2022-02-19 00:30 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మిగ‌తా మూడు రాష్ట్రాల ఎన్నిక‌లు అప్రాధాన్యం అయిపోగా కేవ‌లం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ , పంజాబ్ రాష్ట్రాల్లోని ఎన్నిక‌లు మాత్ర‌మే పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీనికి కార‌ణం ఆయా పార్టీలు పెట్టిన స్పెష‌ల్ ఫోక‌స్‌. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు. అర‌వింద్ కేజ్రీవాల్ ఓ ఉగ్ర‌వాది అని కేజ్రీవాల్ మాజీ స‌హ‌చ‌రుడు క‌వి కుమార్ విశ్వాస్ ఆరోప‌ణలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా కేజ్రీవాల్ కౌంట‌ర్ ఇచ్చారు.  ప్ర‌పంచంలోనే అత్యంత తీయని ఉగ్ర‌వాదిని తానే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇవాళ ఆయ‌న ఓ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.

ఇటీవ‌ల ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్య‌మంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్ర‌ధాని అయినా అవుతాన‌ని సీఎం కేజ్రీవాల్ త‌న‌తో అన్నార‌ని కుమార్ విశ్వాస్ వెల్ల‌డించారు. ఈ కామెంట్ల‌పై స్పందిస్తూ త‌న‌ను తాను ఉగ్ర‌వాదిని అని ప్ర‌క‌టించుకున్న కేజ్రీవాల్‌... హాస్పిట‌ళ్లు, స్కూళ్లు, రోడ్లు నిర్మించే స్వీటెస్ట్ టెర్ర‌రిస్టుని అని కేజ్రీ అన్నారు. వృద్ధుల‌కు ఆశ్ర‌మాల‌కు, ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఉగ్ర‌వాదినంటూ ఆయ‌న అన్నారు.

విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని, వాటిని న‌మ్మితే నిజంగానే నేను ఉగ్ర‌వాదిని అవుతాన‌ని, అలాంట‌ప్పుడు గ‌డిచిన ప‌దేళ్ల నుంచి భ‌ద్ర‌తా ఏజెన్సీలు ఏం చేస్తున్న‌ట్లు అని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. త‌న‌పై ఎన్ఐఏలో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌నున్న‌ట్లు ఓ ఆఫీస‌ర్ తెలిపార‌ని, రెండు రోజుల్లో ఆ కేసు ఫైల్ చేయ‌నున్న‌ట్లు తెలిసింద‌న్నారు. అలాంటి ఎఫ్ఐఆర్‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు ఢిల్లీ సీఎం ఆస‌క్తిక‌ర‌ కౌంట‌ర్ ఇచ్చారు.

వందేళ్ల క్రితం కూడా భ‌గ‌త్ సింగ్‌ను బ్రిటీష‌ర్లు ఉగ్ర‌వాదిగా పిలిచార‌ని గుర్తు చేసిన అర‌వింద్ కేజ్రీవాల్ భ‌గ‌త్‌ను తాను గుడ్డిగా ఫాలో అవుతాన‌ని, ఇప్పుడు మ‌ళ్లీ చ‌రిత్ర తిరుగ‌రాస్తున్నార‌ని, అవినీతి నేత‌లంతా ఒక్క‌టై భ‌గ‌త్ సింగ్ భ‌క్తుడిని ఉగ్ర‌వాదిగా పిలుస్తున్న‌ట్లు కేజ్రీ అన్నారు.

మ‌రోవైపు  ఆప్ నేత రాఘవ్ చ‌ద్దా మాట్లాడుతూ.. ఖ‌లిస్తాన్‌కు మ‌ద్ద‌తు విష‌యం కుమార్‌కు  ముందే తెలిస్తే.. 2017 ఎన్నిక‌ల్లో ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చ‌ద్దా సూటిగా ప్ర‌శ్నించారు. కేజ్రీవాల్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డానికి, ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఇలా ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. పంజాబ్ ప్ర‌జ‌ల‌ను మోస‌పుచ్చేందుకే కుమార్ విశ్వాస్ ఈ ఆరోప‌ణ‌లు చేశార‌న్నారు. ప్ర‌జ‌ల్లో లేనిపోని గంద‌ర‌గోళాన్ని సృష్టించ‌డానికే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, పంజాబీలు ఆమ్ఆద్మీతోనే వున్నార‌ని రాఘ‌వ్ చ‌ద్దా ధీమా వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News