నేను దేవుడ్ని..రాష్ట్రప‌తిని చేయండి!

Update: 2017-07-01 10:35 GMT
కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్య‌ర్థుల గురించి జోరుగా మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్డీఏ తరపున రామ్‌ నాథ్‌ కోవింద్ - విపక్షాల నుంచి మీరా కుమార్ పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో వారి పేర్లు అంద‌రి నోళ్లలో నానుతున్నాయి. అయితే, రాష్ట్రప‌తి ప‌ద‌వికి నామినేష‌న్ వేసి తిర‌స్క‌ణ‌కు గురైన కొంత‌మంది అభ్య‌ర్థ‌లు పేర్లు కూడా ప్రాముఖ్యాన్ని సంత‌రించుకున్నాయి.

హరియాణాలోని పానిపట్‌ కు చెందిన దేవి దయాళ్‌ అగర్వాల్ నామినేషన్ ను ఈసీ తిర‌స్క‌రించింది. ఆయ‌న నామినేష‌న్ ప‌త్రంలో పొందుప‌ర‌చిన విష‌యాలు చూసి ఈసీకి మ‌తిపోయింది.

‘నేను దేవుడిని, నన్ను రాష్ట్రపతిని చేయండి. సర్వశక్తిమంతుడిని అయిన నాకు ఎమ్మెల్యేలు - ఎంపీల మద్దతు కూడా అవసరం లేదు. మీరాకుమార్‌ - రామ్‌ నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ఎన్నిక కాలేరు. వాళ్లవద్ద ఏమైనా మంత్రదండం ఉందా? నా అభ్యర్థనను విని నన్ను రాష్ట్రపతిని చేయకపోతే ఢిల్లీలో భయంకరమైన భూకంపం వస్తుంది’ అని ఆయ‌న రాశారు. అగర్వాల్ - తనను తాను 24 సార్లు దేవుడిగా సంబోధించుకున్నారు.

హ‌రియాణాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్‌ కూడా రాష్ట్రపతి పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అగ‌ర్వాల్ క‌న్నా ఆయన రెండాకులు ఎక్కువే చ‌దివారు. భగత్‌ సింగ్‌ - సుభాష్‌ చంద్రబోస్ - స్వామి వివేకానంద - డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ - నెల్సన్‌ మండేలా - అబ్రహం లింకన్ - ఐన్‌ స్టీన్ తదితరులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ట‌.

మరొకరయితే ఏకంగా ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా - బిర్లా - ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ - బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు తనకు మద్దతిస్తున్నట్లు తన నామినేషన్‌ పత్రాల్లో రాసుకొని త‌మ అజ్ఞానాన్ని చాటుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News