మీకు క్రెడిట్ కార్డు అవ‌స‌ర‌మేంది అంబానీజీ!

Update: 2017-12-01 16:45 GMT
దేశంలో మొన‌గాడు సంప‌న్నుడు ముకేశ్ అంబానీ. ముఖ్య‌మంత్రులు మొద‌లు పీఎంవో సైతం ముకేశ్ పేరు విన్నంత‌నే అలెర్ట్ అవుతుంద‌ని చెబుతారు. ఈ మ‌ధ్య‌నే దేశం స్థాయి నుంచి ఆసియాలోనే మొనగాడి సంప‌న్నుడ‌న్న రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యాపారం గురించి.. భ‌విష్య‌త్ ఆలోచ‌న‌ల గురించి.. వ్యాపార ప్రణాళిక‌ల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పే అంబానీ.. సొంత విష‌యాల గురించి చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తార‌ని చెప్పాలి.

త‌న వ్య‌క్తిగ‌త అంశాల్ని ఏ వేదిక మీద పెద్ద‌గా పంచుకోని ముకేశ్‌.. తాజాగా హిందూస్థాన్ టైమ్స్ నిర్వ‌హించిన లీడ‌ర్ షిప్ స‌ద‌స్సులో ఓపెన్ అయ్యారు. ఎప్ప‌టిలానే వ్యాపార అవ‌కాశాలు.. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ.. ప్ర‌గ‌తి లాంటి సీరియ‌స్ విష‌యాల గురించి మాట్లాడిన అంబానీ ఆస‌క్తిక‌ర‌మైన త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు.

అభివృద్ధి ప‌థంలోకి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌య‌నిస్తోంద‌న్న ముఖేశ్‌.. 2024 నాటికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌న్నారు. ప‌ద‌మూడేళ్ల క్రితం (2004) భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 500 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండేద‌ని.. 20 ఏళ్ల‌లో ఐదు ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని తాను అప్ప‌ట్లోనే అంచ‌నా వేసిన‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం దేశ ప్ర‌గ‌తిని చూస్తుంటే.. తాను అనుకున్న గ‌డువు కంటే ముందు ల‌క్ష్యాన్ని భార‌త్ చేరుకుంటుందన్న భావ‌న క‌లుగుతోంద‌న్నారు. వ‌చ్చే ప‌దేళ్ల‌లో ఏడు ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు మ‌నం చేరుకోగ‌ల‌మా? అంటే.. క‌చ్ఛితంగా చేరుకోగ‌ల‌మ‌ని చెబుతాన‌న్నారు. 2030 నాటికి 10 ట్రిలియ‌న్ డాల‌ర్ల స‌మీపానికి చేరుకుంటామ‌న్నారు. డ‌బ్బుల గురించి తాను ఎప్పుడూ ఆలోచించ‌లేద‌న్నారు.

త‌న‌కు సంబంధించినంత‌వ‌ర‌కూ వ‌న‌రులే ముఖ్య‌మ‌న్నారు. తాను ఎక్క‌డికి వెళ్లినా డ‌బ్బులు తీసుకెళ్ల‌న‌ని.. త‌న‌కు క్రెడిట్ కార్డు లేద‌న్నారు. త‌న డ‌బ్బుల్ని వేరొక‌రు చెల్లిస్తార‌ని.. ఈ త‌రం చాలా భిన్న‌మైన‌ద‌ని.. విభిన్నంగా ఆలోచిస్తుంద‌న్నారు. అయినా.. అంబానీ లాంటోడు క్రెడిట్ కార్డు ప‌ట్టుకొని.. క్యూ వ‌ర‌స‌లో నిలుచొని బిల్లు చెల్లిస్తారా ఏంటి? అయినా అంబానీ లాంటి వ్య‌క్తి కావాల‌నుకున్న వ‌చ్చేయ‌ట‌మే త‌ప్పించి.. స‌గ‌టుజీవి మాదిరి చెల్లింపుల చూడ‌టం లాంటివి ఎందుకు చూస్తారు..?
Tags:    

Similar News