నెల్లూరు అంటే అంత ఇష్టమున్నా.. ఎందుకు వదిలి వెళ్లాడో చెప్పిన పవన్

Update: 2020-12-06 14:30 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోపర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరుతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టిన ఆయన.. నెల్లూరులో ఎక్కువకాలం ఉన్నారు. తన తల్లి ఊరైన నెల్లూరు అంటే పవన్ కు చాలా ఇష్టం. అక్కడే ఎక్కువకాలం పెరిగిన విషయాన్ని అప్పుడప్పుడు చెబుతుంటారు.

తనకు నెల్లూరు అంటే ఎనలేని అభిమానమని.. మొక్కలంటే విపరీతమైన ప్రేమగా చెప్పారు. నెల్లూరులో ఉన్నప్పుడు తమ ఇంట్లో మొక్కలు.. చెట్లు ఉండేవి కావని.. అందుకే ఎక్కువకాలం నెల్లూరులో ఉండలేకపోయిన కొత్త విషయాన్ని వెల్లడించారు. ‘‘నెల్లూరు అంటే చాలా ఇష్టం. ఇక్కడే చాలాకాలం ఉన్నా. అప్పట్లో మేం ఉండే ఇంట్లో మొక్కలు ఉండేవి కావు. నాకేమో మొక్కలంటే ఇష్టం. అందుకే.. నెల్లూరు వదిలేసి వెళ్లిపోయా’ అని చెప్పారు.

చిన్నప్పుడు తనకు గొప్ప గొప్ప ఆశయాలు ఏమీ ఉండేవి కావని.. ఎస్ఐ కావాలని మాత్రం అనుకునేవాడినని చెప్పారు. ప్రజల్ని రక్షించుకునేందుకు పోలీస్ కావాలని తాను అనుకున్నట్లు చెప్పారు. సాటి మనిషికి ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాను పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కీలకంగా పని చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

చదువు మధ్యలో ఆపేసినా.. చదవటం మాత్రం ఆపలేదన్నారు. ఇంట్లోనూ.. బంధువుల ఇళ్లల్లోనూ రాజకీయ వాతావరణం కారణంగానే తనకు రాజకీయ స్పృహ పెరిగినట్లు చెప్పుకొచ్చారు. నెల్లూరుతో తనకున్న అనుబంధం గురించి పవన్ చెబుతున్న మాటలకు ఆ జిల్లా వాసులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Tags:    

Similar News