టీ అమ్మిన అతగాడి ఆస్తి ఎంతంటే..

Update: 2016-12-18 04:57 GMT
ఒకప్పుడు టీ అమ్మాడు. తర్వాత టీ అమ్మటం మానేసి ఫైనాన్స్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. మూడు పువ్వులు.. ఆరుకాయలన్నట్లుగా సాగుతున్న అతడి వ్యాపార గుట్టు తాజాగా బయటపడింది. ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో అతగాడి భాగోతం బయటకు రావటమే కాదు.. అతడి ఆస్తి వివరాల్ని చూస్తున్న అధికారులకు నోట మాట రాని పరిస్థితి. టీ అమ్మిన అతగాడి ఆస్తి ఇన్ని వందల కోట్లా అని గుడ్డు తేలేసే పరిస్థితి.

గుజరాత్ కు చెందిన బాజీవాలా ఉడ్నా అనే వడ్డీ వ్యాపారి ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల క్రితం టీ అమ్మిన ఇతగాడి ప్రస్తుత ఆస్తి రూ.250 కోట్లకు పైనే అని చెబుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత బాజీవాలా రూ.1.5కోట్లను డిపాజిట్ చేశారు. భారీ ఎత్తున డిపాజిట్లు చేసిన ఖాతాలపై దృష్టి సారించిన ఐటీ శాఖ.. బాజీవాలా మీద కాసింత ఫోకస్ చేసింది.

అతడి ఇల్లు.. బ్యాంకు లాకర్లపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన ఐటీశాఖ.. ఒక్కసారిగా అతడి ఆస్తులన్నింటిపైనా దాడులు చేపట్టింది. ఈ క్రమంలో అతడికి.. అతడి కుటుంబ సభ్యులకు 16 బ్యాంకు లాకర్లు ఉన్నట్లుగా తేలటంతో పాటు.. అతడి ఆస్తి విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుందని తేల్చారు. ఐటీ అధికారులు దాడులు చేసిన 8 లాకర్లలో 180 కేజీల వెండి.. రూ.2.5 కోట్ల విలువైన బంగారం.. రూ.1.08 కోట్ల కొత్త నోట్లు.. రూ.23 లక్షల విలువ ఉన్న రద్దు అయిన నోట్లు.. కిసాన్ వికాస్ పత్రు.. 200 ఆస్తులు.. ఒప్పంద పత్రాలు.. 27 బ్యాంకు ఖాతాల్ని అధికారులు గుర్తించారు.

నోట్ల రద్దు నిర్ణయం పుణ్యమా అని బాజీవాలా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారీ మొత్తంతో అతగాడి ఆస్తులు మొత్తం బయటకు రావటమే కాదు.. టీ అమ్మకాలతో షురూ చేసిన అతగాడు వందల కోట్లు రూపాయిలు పోగేయటం ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News