హానన్ హమీద్.. స్వశక్తితో ఎదిగింది. తన కాళ్ల మీద తను నిలబడుతూ చిన్న వయస్సులోనే జీవితంతో పోరాడుతోంది. 19 ఏళ్ల ఈ కేరళ అమ్మాయి చదువుకుంటూనే బతుకుబండిని లాగేందుకు చిన్న చిన్న పనులు చేస్తూ ఆదర్శంగా జీవిస్తోంది. చేపలు పడుతూ - ఈవెంటే మేనేజ్ మెంట్ ప్రోగ్రాంలు చేస్తూ - ట్యూషన్లు చెబుతూ - రేడియో ప్రోగ్రామ్స్ చేస్తూ సంపాదించుకుంటోంది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగానే రాణిస్తోంది. ఇలా పొట్టకూటి కోసం కష్టపడుతున్న హానన్ హమీద్ విజయగాథ ఇటీవల అక్కడి మలయాళ పత్రిక ‘మాతృభూమి’ పతాక శీర్షికన ప్రచురించింది. ఆదర్శం ఈ మహిళ అంటూ కొనియాడింది. దీంతో హానన్ పేరు మారుమ్రోగింది. ఎంతో మంది ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రాజకీయన నేతలు - సినిమా సెలబ్రిటీలు ఆదుకుంటామని మద్దతు తెలిపారు. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ తో తాను తీయబోయే సినిమాలో హానన్ కు అవకాశం ఇస్తానని దర్శకుడు అరుణ్ గోపీ ప్రకటించారు.
ఇక హానన్ కు వచ్చిన పేరును జీర్ణించుకోలేని కొంతమంది ఆకతాయి నెటిజన్లు ఆమెపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆమె ఫొటోలు - ప్రముఖులతో దిగిన సెల్ఫీలు - డబ్ స్మాష్ లను సృష్టించి విమర్శలు చేశారు. హానన్ నిజాయితీని శంకిస్తూ పోస్టులు పెట్టారు. పేపర్ల పడడమే నేను చేసిన నేరమా అంటూ ఇప్పుడు యువతి భోరున విలపిస్తోంది. తనకు సాయం అక్కర్లేదని.. తన మానాన తనను బతకనివ్వాలని వేడుకుంటోంది. తాజాగా ఆమె ఏడుస్తూ తనపై అసభ్య కామెంట్లు - ట్రోలింగ్ లు చేయవద్దని ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది..
ఈ కేరళ యువతిని చిత్రహింసలు పెడుతున్న నెటిజన్ల వైనాన్ని తెలుసుకున్న కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి అల్ఫోన్స్ తీవ్రం గా స్పందించారు. ఆమెను హింసిస్తున్న రాంబదులారా అంటూ నెటిజన్లపై ఫేస్ బుక్ లో మండిపడ్డారు. హానన్ వ్యవహారం దుమారం రేపడంతో ఎట్టకేలకు కేరళ సీఎం స్పందించారు. హానన్ ను సోషల్ మీడియాలో వేధించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.