ఏం చేయ‌లేన‌ప్పుడు మాల్యా అలానే మాట్లాడ‌తాడు

Update: 2017-06-06 07:46 GMT
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భార‌త్.. పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కు వేలాది మంది వ‌చ్చినా.. అంద‌రి దృష్టి మాత్రం ఒక్క‌రి మీద‌నే ఫోక‌స్ అయ్యింది. ఇక‌.. మీడియా సంగ‌తి అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మ్యాచ్ త‌ర్వాతి రోజున‌.. మ్యాచ్ వార్త ఎంత ఫోక‌స్ అయ్యిందో.. మ్యాచ్‌కు వ‌చ్చిన ఒక ప్ర‌ముఖుడికి సంబంధించిన వార్త అంతే ప్ర‌యారిటీతో ప‌బ్లిష్ అయ్యింది. ఇంత‌కీ.. ఆ పెద్ద‌మ‌నిషి ఎవ‌రో కాదు.. ప‌లు బ్యాంకుల‌కు వేలాది కోట్ల రూపాయిలు ఎగ్గొట్టి.. రాత్రికి రాత్రే బ్రిట‌న్‌కు వెళ్లిపోయిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా.

ఓ ప‌క్క ప‌రారీలో ఉన్న ప్ర‌ముఖుడిగా ఉన్న ఆయ‌న‌.. ఏకంగా మ్యాచ్‌కు రావ‌టం.. అక్క‌డి క్రికెట్  ప్ర‌ముఖుల‌తో మాట్లాడ‌టం సంచ‌ల‌నంగా మారింది. మీడియాలో త‌న రాక గురించి భారీగా ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో.. మాల్యా త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఎడ్జ్ బాస్ట‌న్ లో జ‌రిగిన మ్యాచ్‌ కు తాను రావ‌టంపై మీడియా క‌వ‌రేజ్ సెన్సేష‌న‌ల్ గా ఉంద‌ని.. అయితే.. తాను మిగిలిన అన్ని మ్యాచ్‌ ల‌కు వ‌చ్చి టీమిండియాకు మ‌ద్ద‌తుగా నిలుస్తాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

త‌న తాజా ట్వీట్ల‌లో.. టీమిండియాను పొగిడేసిన మాల్యా.. పాక్ జ‌ట్టును చావుదెబ్బ కొట్టిన‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. వ‌ర‌ల్డ్ క్లాస్ కెప్టెన్‌.. వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌.. వ‌ర‌ల్డ్ క్లాస్ జెంటిల్మ‌న్ అంటూ పొగ‌డ్త‌ల మీద పొగ‌డ్త‌లు కురిపించేసిన వైనాన్ని ప‌క్క‌న పెడితే.. వేలాది కోట్లు ఎగ్గొట్టి.. ప‌రారీలో ఉన్న వ్య‌క్తి మిగిలిన మ్యాచ్‌ల‌కు కూడా వ‌స్తాన‌ని ద‌మ్ముగా ట్వీట్ చేయ‌టం దేనికి నిద‌ర్శ‌నం? త‌ప్పు చేసి దేశం విడిచి పారిపోయిన వ్య‌క్తిని.. ప‌ట్టుకొని దేశానికి తీసుకురాకుండా మ్యాచులు చూసుకుంటూ కాల‌క్షేపం చేస్తున్న తీరు చూస్తే.. మ‌న వ్య‌వ‌స్థ చేత‌కానిత‌నంపై మాల్యాకు చాలా మంచి అవ‌గాహ‌నే ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News