కేసీఆర్ సారును గుర్తు చేస్తున్న రజనీ

Update: 2020-03-13 07:00 GMT
రాజకీయాల్లోకి వస్తానంటూనే.. రాకుండా ఉండే ప్రముఖులు చాలా తక్కువగా కనిపిస్తారు. రాజకీయాల్లో రావాలన్న ఆలోచన వచ్చిన తర్వాత క్షణమొక యుగంలా నడుస్తుంటుంది. అలాంటిది.. వస్తాను.. వచ్చే ఆలోచన ఉందంటూనే ఏళ్లకు ఏళ్లు గడిపేయటం మాత్రం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కే చెల్లుతుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆయన్ను అభిమానించే వారికి కూసింత నిరాశను కలిగించేలా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన మాటల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి మాటలు వినిపించటం విశేషం.

తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఆదర్శాలు.. ఆయన వల్లె వేసిన సిద్ధాంతాలు.. కలలు.. తర్వాతి రోజుల్లో ఏమయ్యాయన్నది తెలిసిందే. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటమే తన లక్ష్యం తప్పించి.. సీఎం పదవిని చేపట్టటం తనకే మాత్రం ఆసక్తి లేదన్నట్లు వ్యవహరించేవారు. ఆయన మాటల్లోనూ స్పష్టం చేశారు. కేసీఆర్ మాట అంటే మాటేనని.. తేడా వస్తే తల నరుక్కోవటానికైనా సిద్ధమే కానీ.. వెనక్కి తగ్గేదే లేదనే మాట ఆయన నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి కేసీఆర్.. ఉద్యమం ముగిసి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి దళిత వ్యక్తి తొలి ముఖ్యమంత్రి అవుతారన్న తన కలను ఎంతమేర అమలు చేశారో తెలిసిందే. దాదాపు ఇదే తరహా వ్యాఖ్యలు తాజాగా రజనీకాంత్ నోటి నుంచి రావటం గమనార్హం.

తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తి లేదన్న ఆయన.. రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం మూడు లక్ష్యాలు నిర్దేశించి.. ఆ దిశగా ప్రజల్లో మార్పు వచ్చాకే తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న మాటలు చూస్తే.. కొత్త నీరసం ఆవహించటం ఖాయం. రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? మిగిలిన వారికి భిన్నంగా ఉన్నానన్న సంకేతాలు ఇవ్వటానికి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న సందేహాలు రావటం ఖాయం. వీటిని పక్కన పెట్టి చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పే మాటలకు.. ఆదర్శాలకు తర్వాతి రోజుల్లో ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధం లేని తీరులోనే రజనీ నడుస్తున్నారా? అన్నదిప్పుడు సందేహంగా మారింది.

రాజకీయాల్లో కొత్త శక్తి.. కొత్త రక్తం రావాలని చెబుతున్న ఆయన.. తాను పార్టీ పెడితే యువత.. విశ్రాంత న్యాయమూర్తులు.. ఐఏఎస్..ఐపీఎస్ లకు సీట్లు ఇస్తామని.. తాను అందరికి వారధిలా ఉంటానని వ్యాఖ్యానించటం గమనార్హం. ఏమైనా.. రజనీ తాజా వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉందన్న విషయాన్ని చెప్పేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News