గ‌ల్లా అరుణ‌మ్మ‌.. ఇదేం వైరాగ్యం..?

Update: 2018-06-07 04:29 GMT
చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఒక ముద్ర వేసిన నేత‌గా గ‌ల్లా అరుణ కుమారికి పేరుంది.  కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంపాటు కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలో చేరిన వైనం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో త‌న‌కు ఇచ్చిన చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ ప‌ద‌వి వ‌దులుకున్న‌ట్లుగా.. బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

క్లారిటీ ఇచ్చే స‌మ‌యంలో తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు గ‌ల్లా. తాను కార్య‌క‌ర్త‌ల‌కు ఏమీ చేయ‌లేక‌పోతున్న‌ట్లుగా చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆమె కంట క‌న్నీరు కారింది. తాను నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ ప‌ద‌విని వ‌దులుకున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు.

తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్న ఆమె.. కుటుంబ స‌భ్యుల‌ను ఎవ‌రినైనా బ‌రిలోకి దింపాల‌ని చంద్ర‌బాబు త‌న‌ను కోరిన మాట వాస్త‌వ‌మ‌న్నారు. తాను పార్టీ మారేది లేద‌న్న ఆయ‌న‌.. త‌న‌పై ఎవ‌రి ఒత్తిడి లేద‌న్నారు.

ఒక‌ప్పుడు త‌న మాట‌కు తిరుగు ఉండేది కాద‌ని.. తానేం చెబితే అది జ‌రిగేద‌న్న ఆమె.. ఇప్పుడు అలా లేద‌నే మాట వాస్త‌వ‌మంటూ మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు. అంత‌లోనే వైరాగ్య‌పు వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. ఇదో కాల‌చ‌క్రం.. రాజ‌కీయ నాయ‌కులు కూడా అంతే. ఒక‌రు వ‌స్తుంటే.. మ‌రొక‌రు పోతుంటారు. ఈ విష‌యం అంద‌రూ గుర్తు పెట్టుకోవాలంటూ గ‌ల్లా అరుణ‌మ్మ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన గ‌ల్లా అరుణ‌కుమారి నోటి నుంచి ఇప్పుడు ఈ తీరులో వైరాగ్య‌పు మాట‌లు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News