జగన్ మళ్ళీ గెలిస్తే పధకాలు బంద్... ?

Update: 2022-03-13 03:30 GMT
ఏపీలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు పధకాలను అందిస్తున్నామని కూడా చెబుతారు. కడుపులో ఉన్న శిశువు నుంచి పండు ముసలివారి దాకా అందరికీ పధకాలను డిజైన్ చేసి అందచేస్తున్న ఘనత జగన్ సర్కార్ ది అని కూడా ఆర్భాటాలు చేస్తారు.

అయితే మూడేళ్ళుగా విచ్చలవిడిగా అప్పులు చేసి సంక్షేమ రధాన్ని లాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ అప్పు ఆరు లక్షల కోట్లకు పైదాటిందని చెబుతారు.

ఈ నేపధ్యంలో తాజా బడ్జెట్ లో అప్పుల ప్రస్థావన లేకుండా కేవలం వరాల గురించి మాత్రమే జాగ్రత్తగా చెప్పుకున్నారు. దీని మీద బీజేపీ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ క్రిష్ణారావు వైసీపీ బడ్జెట్ మీద ఘాటైన కామెంట్స్ చేశారు. అప్పుల గురించి చెప్పకుండా బడ్జెట్ లో అనేక అంశాలు బాగా  చెప్పుకుపోయారని అన్నారు. ఇక పరిమితి లేని అప్పులను మూడేళ్లలో ప్రభుత్వం చేసిందని ఆయన దుయ్యబెట్టారు. రాష్ట్రాన్ని దివాళా దిశగా వైసీపీ ప్రభుత్వం నడిపించిందని కూడా ఆయన విమర్శించారు.

కేంద్ర గ్రాంట్ల తో సహా అన్నీ కూడా పెద్ద అంకెలు పెట్టారని, కానీ గత మూడేళ్ల బడ్జెట్లను బేరీజు వేసుకుంటే చెప్పిన దానికీ జరిగిన దానికీ ఎక్కడా పొంతన లేదని ఆయన అన్నారు. ఇక కాగ్ గత ఏడాది ఏపీ అప్పుల మీద వివరాలు అడిగినా ఇవ్వలేదని ఆరోపించారు.

ఇలా అప్పులు చేస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ ముందస్తు ఎన్నికలకు పోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఆయన పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్ తీరుని ఒక్క ముక్కలో చెప్పాలీ అంటే అప్పు చేయి పంచు అన్నట్లుగానే ఉదని ఐవైఆర్ ఎద్దేవా చేశారు.

ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తిరిగి లక్  తగిలి మరోసారి  అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పధకాలు అన్నీ ఎత్తేస్తారు అని ఐవైఆర్ జోస్యం చెప్పారు.

మొత్తానికి ప్రజాకర్షణ పధకాలు అన్నీ ఎన్నికల్లో ఓట్లేయించుకుని రెండవసారి అధికారంలోకి రావడానికే తప్ప పేదల పట్ల  చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎక్కడా లేదని ఐవైఆర్ ఎండగట్టారు. ఒకవేళ ప్రభుత్వం మదిలో అదే ఉంటే కనుక సంక్షేమం పేరిట పధకాలు అందుకుంటున్న   వారందరికీ  భారీ షాక్ ఫ్యూచర్ లో తగలడం ఖాయమే మరి.

 
    

Tags:    

Similar News