తొలిచూపులో ప్రేమ‌..ఓ అంద‌మైన అబ‌ద్ద‌మ‌ట‌

Update: 2017-12-03 23:30 GMT
‘మేం మొదటిసారి కలుసుకున్నప్పుడే ప్రేమ పుట్టింది’ అని చాలామంది చెప్పే దాంట్లో నిజం ఎంత‌మాత‌రం  లేదని తేలింది. ఎంత  రాజకుమారుడు అయినా..తొలిసారి అతని ప్రేయసిని కలిసినప్పుడు కలిగింది మోహమే తప్ప మరేదీకాదని తెలుస్తున్నది. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ‘తొలిచూపులోనే ప్రేమ’ అనేది అసలు ఉత్పన్నం కాదని నిరూపిస్తోంది. నెదర్లాండ్స్‌లోని గ్రోనిన్జెన్‌ యూనివర్సిటీకి చెందిన మానసిక నిపుణులు సాధారణ శృంగార ప్రతిబింబం (కామన్‌ రోమోకాం ట్రోప్‌) అనేది నిజమా కాదా అనే అంశంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో సాధారణంగా ఆడామగ మధ్య ఉండే శృంగార భావన ‘తొలిచూపులోనే ప్రేమ’ కాదని.. అది దృఢమైన శారీరక ఆకర్షణ మాత్రమే అని తేలింది.

తొలిచూపులోనే ప్రేమ అనే అంశంపై 396 మంది డచ్‌ - జర్మన్‌ విద్యార్థులపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భిన్న లింగ సంపర్కులే. ఆన్‌ లైన్‌ సర్వే ద్వారా.. వారి ప్రస్తుత శృంగార బంధంపై పలు ప్రశ్నలు అడిగారు. వారికి గుర్తుతెలియని మహిళలు లేదా పురుషుల చిత్రాలు చూపించి.. వారు ఏమేరకు తమను ఆకర్షించారో రేటింగ్‌ ఇవ్వాలని కోరారు. దీంతోపాటు తొలిచూపులోనే ప్రేమ అనే భావన కలిగిందా? అని కూడా ప్రశ్నించారు. వారు చేసిన పలు వ్యాఖ్యల ద్వారా విశ్లేషణ నిర్వహించారు. దీనిలో యువతీయువకుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం, అభిరుచి, నిబద్ధతకు సంబంధించిన భావాలేవీ వెల్లడి కాలేదు. దీంతోపాటు 90 నుంచి 20 నిమిషాల్లో ఒకరినిమరొకరు అర్థం చేసుకోవడానికి ‘స్పీడ్‌ డేటింగ్‌’ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత వారి భాగస్వాముల గురించి ప్రశ్నించారు. శారీరక ఆకర్షణకు సంబంధించి వారి అనుభవాలను ఐదు పాయింట్ల ఆకర్షణ స్కేల్‌పై ఒక్కో పాయింట్‌ను పెంచుతూ ఇతరులతో సరిపోల్చారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న ఓ అభ్యర్థి ‘తొలిచూపులోనే ప్రేమ’ అని తొమ్మిదిసార్లు తన భావాలను వ్యక్తం చేశాడు. మరోవైపు స్పీడ్‌ డేటింగ్‌లో ‘తొలిచూపులోనే ప్రేమ’ అని పరస్పరం ఎవరూ పేర్కొనలేదు. మొత్తం పరిశోధన ప్రకారం తొలిచూపులోనే ప్రేమ అనేది నిజంగా గాఢమైన ప్రేమ లేదా సాధారణ ప్రేమగా వ్యక్తం కాలేదని పరిశోధకులు వెల్లడించారు. ‘తొలిచూపులోనే ప్రేమ అనేది మన భావనలోనే ఉంటుంది. ఇది నిజమైన ప్రేమతో సమానమైనది కాదు. కానీ అప్పటికప్పుడు శృంగార బంధం, ఇతరులను ఆకర్షించడం అనే ఆలోచన కలుగుతుంది’ అని పరిశోధకులు వెల్లడించారు. ఆసక్తికరంగా తొలిచూపులోనే ప్రేమ అని పేర్కొనని వారి కంటే తొలిచూపులోనే ప్రేమ కలిగింది అని తెలిపినవారు.. వారి బంధంపై ఎక్కువస్థాయి అభిరుచిని వ్యక్తం చేశారు.
Tags:    

Similar News