జగన్ తో సెల్ఫీ..వణికిపోతున్న ఐఏఎస్ లు?

Update: 2016-03-23 10:35 GMT
కీలక స్థానాల్లో ఉండేవారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇక.. ప్రభుత్వాల్లో కీలకభూమిక పోషించే వారు వీలైతే తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారపక్షానికి అగ్రహం తెప్పించేలా వ్యవహరించకూడదు. అలా కానీ జరిగితే.. సదరు అధికారులకు వాటిల్లే నష్టం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. మితిమీరిన అత్సుత్సాహం తాజాగా కొందరు ఐఏఎస్ అధికారులకు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టటం ఆసక్తికరంగా మారింది. ఏపీకి చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు మితిమీరిన ఉత్సాహంతో విపక్ష నేతలతో వ్యవహరించిన చొరవ అధికారపక్షానికి ఆగ్రహం తెప్పించటమే కాదు.. ముఖ్యమంత్రి మండిపాటుకు గురైందన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయినా.. ఐఏఎస్ లు అంతలా ఎలా బుక్ అయ్యారన్న విషయాన్ని చూస్తే.. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానంలో కొందరు ఐఏఎస్ లు బయలుదేరారు. ఊహించని విధంగా అదే విమానంలో విపక్ష నేత జగన్ కూడా ప్రయాణం చేస్తున్నారు. విమానం బయలుదేరటానికి ముందు వచ్చిన జగన్ ను చూసిన ఐఏఎస్ అధికారుల్లో కొందరు మర్యాదపూర్వకంగా లేచి విష్ చేసి.. తమ స్థానంలో తాము కూర్చుండిపోయారు.

మరికొందరు మాత్రం జగన్ దగ్గరకు వెళ్లి.. ఆయనతో కరచాలనం చేసి.. సెల్ఫీలు దిగేందుకు మోజు ప్రదర్శించారు. ఆపై ఏపీ ముఖ్యమంత్రి తీరుపై తమ మనసులోని మాటల్ని పక్కవారు చెప్పుకుంటూ ఉండిపోయారు. విమానం గమ్యస్థానానికి చేరుకుంది. ఐఏఎస్ లు కాస్త కునుకు తీసి.. కళ్లు నులుముతుండగా.. వారికి కనిపించిన దృశ్యం షాకింగ్ గా మారింది.

వారికి అంతలా ఇబ్బంది పెట్టిన దృశ్యం ఏమిటంటే.. వారు ప్రయాణిస్తున్న విమానంలోనే ఏపీ మంత్రులు ఇద్దరు ఉండటం.. వారు జరిగిన భాగోతాన్ని తమ కళ్లారా చూడటమే కాదు.. విషయం మొత్తం సినిమాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినిపించారన్న మాట బలంగా వినిపిస్తోంది. జగన్ తో సెల్ఫీలు.. బాబు సర్కారు మీద విమర్శలతో మాంచి ఉత్సాహాన్ని ప్రదర్శించిన ఐఏఎస్ లకు తాము చేసిన తప్పేంటో అర్థమయ్యాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ఉదంతంపై ఏపీ ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని.. విపక్ష నేతతో చనువుగా వ్యవహరించి.. వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ లకు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే స్థాన చలనం తప్పదంటున్నారు. తొందరపాటుతో లేనిపోని తలనొప్పులు నెత్తి మీదకు తెచ్చుకోవటమంటే ఇదేనేమో?
Tags:    

Similar News