క‌లెక్ట‌ర్ వేధిస్తున్నారని.. ఐఏఎస్ రాజీనామా!

Update: 2021-06-04 23:30 GMT
''నేను క‌లెక్ట‌ర్ కు అన్ని విధాలా గౌర‌వం ఇచ్చాను. అయినా.. న‌న్ను వేధిస్తున్నారు. టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నాపై ఎందుకు అంత ప‌గ‌బ‌ట్టారో నాకు తెలియ‌ట్లేదు. ఇక‌, నేను ప‌నిచేయ‌లేను. అందుకే రాజీనామా చేస్తున్నాను’’ అని సంచలన ప్రకటన చేశారు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్.

ఈ మేర‌కు గురువారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి, మీడియా స‌మ‌క్షంలోనే రాజీనామా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. క‌లెక్ట‌ర్ రోహిణి సింధూరి త‌న‌ను ప‌ని చేసుకోనివ్వ‌ట్లేద‌ని, అడుగ‌డుగునా త‌న‌కు అడ్డు ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఆమె చేష్ట‌ల‌తో తాను ఎంతో విసిగిపోయాన‌ని చెప్పిన శిల్పా నాగ్‌.. ఇంటి దుర‌హంకార క‌లెక్ట‌ర్ ఎవ‌రికీ వ‌ద్దంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌ను టార్గెట్ చేయ‌డంతో చాలా బాధ‌ప‌డ్డాన‌ని చెప్పిన మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌.. ఈ విష‌య‌మై రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కూడా లేఖ‌రాసిన‌ట్టు చెప్పారు. అన్నీ ఆలోచించిన త‌ర్వాత‌.. ఇక్క‌డ ప‌నిచేయ‌డం కంటే.. ఉద్యోగం వ‌దులుకోవ‌డ‌మే మంచిద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెప్పారు. అందుకే రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

కాగా.. శిల్పా నాగ్ 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే మైసూరు క‌మిష‌న‌ర్ గా ఆమె నియ‌మితుల‌య్యారు. కేవ‌లం మూడు నెల‌ల్లోనే ఈ స్థాయిలో వివాదం చెల‌రేగి, రాజీనామా వ‌ర‌కూ వెళ్ల‌డం గ‌మ‌నార్హం. అయితే.. మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ రాజీనామాపై ప్ర‌భుత్వం కానీ, క‌లెక్ట‌ర్ కానీ స్పందించ‌లేద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News